సంజు శాంసన్ ఇన్నింగ్స్‌కు గావస్కర్ మద్దతు

చెన్నైలోని చెపాక్ (చిదంబరం) స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో టీమ్‌ఇండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

By -  అంజి
Published on : 27 Feb 2026 12:36 PM IST

Team India vs Zimbabwe, Sanju Samson Opening, Sunil Gavaskar on Sanju Samson, Abhishek Sharma Batting, Chennai Chidambaram Stadium

సంజు శాంసన్ ఇన్నింగ్స్‌కు గావస్కర్ మద్దతు 

చెన్నైలోని చెపాక్ (చిదంబరం) స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో టీమ్‌ఇండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడీ మార్పు ఆసక్తికరంగా సాగడమే కాకుండా, జట్టు భారీ స్కోరు సాధించడానికి బలమైన పునాది వేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన సంజు, కేవలం 15 బంతుల్లోనే ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లేను సమర్థవంతంగా వాడుకునే క్రమంలో ముజారబానీ బౌలింగ్‌లో అవుటైనప్పటికీ, అప్పటికే మొదటి వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.

సంజు తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అతడికి పూర్తి మద్దతుగా నిలిచారు. "సంజును మనం నిందించలేం. పవర్‌ప్లేలో ఉన్న ఫీల్డింగ్ నిబంధనలను అనుకూలంగా మార్చుకుని, జట్టు కోసం వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలోనే అతడు వికెట్ కోల్పోయాడు" అని గావస్కర్ విశ్లేషించారు.

గత మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఓపెనర్లుగా రావడం వల్ల ప్రత్యర్థి జట్లు స్పిన్నర్లను ప్రయోగించి వారిని కట్టడి చేశాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా జట్లు ఇదే వ్యూహంతో భారత్‌ను ఇబ్బంది పెట్టాయి. అయితే, ఈసారి సంజు శాంసన్ (కుడిచేతి వాటం) రావడంతో ఆ వ్యూహాలు ఫలించలేదు. ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వల్ల భారత్‌కు శుభారంభం దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఏకంగా 72 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు నెట్ రన్ రేట్ భారీగా మెరుగైంది. గతంలో -3.800 వద్ద ఉన్న రన్ రేట్, ఇప్పుడు -0.100కు చేరుకోవడం విశేషం.

Next Story