శ్రీలంక టూర్ గెలుపుతో ప్రారంభం..తొలి మ్యాచ్‌లో హెడ్‌కోచ్ గంభీర్ సక్సెస్
టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జూలై 27న పల్లెకలెలె వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 7:09 AM ISTశ్రీలంక టూర్ గెలుపుతో ప్రారంభం..తొలి మ్యాచ్‌లో హెడ్‌కోచ్ గంభీర్ సక్సెస్
టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జూలై 27న పల్లెకలెలె వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోట్పోయి 213 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 170 పరుగులకే కుప్పకూల్చింది. ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచింది. కెప్టెన్ అసలంక ఫీల్డింగ్ తీసుకుని.. బ్యాటింగ్‌ను భారత్‌కు ఇచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ పలకడంతో వారి స్థానాలను రిజర్వ్ చేసుకునే లక్ష్యంతో ఉన్న యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ బరిలోకి దిగారు. మొదట్నుంచే దూకుడుగా ఆడారు. మంచి ఆరంభాన్నిఅందించారు. జైశ్వాల్ 21 బంతుల్లో 40 పరుగులు, గిల్ 16 బంతుల్లో 34 పరుగులు చేశారు. కెప్టెన్ సూర్య కుమార్ ఏకంగా 26 బంతుల్లో 58 పరుగులు చేసి శ్రీలంకను ఇబ్బంది పెట్టాడు. చివర్లో రిషబ్ పంత్ 33 బంతుల్లో 49 పరుగులు చేసి భారత్ స్కోరును 213/7 గా తరలించారు.
214 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్‌కుదిగింది. తొలుత ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పతుమ్ నిశాంక 48 బంతుల్లో 79 రన్స్ , కుశాల్ మెండిస్ 27 బంతుల్లో 45 రన్స్ చేయడంతో శ్రీలంక లక్ష్యం దిశగా సాగింది. ఓ దశలో 14 ఓవర్లకు 140/1తో నిలిచింది. చివర్లో భారత బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. 19వ ఓవర్ వేసిన రియాన్ పరాగ్ మొదటి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసి శ్రీలంకను ఓటమికి చేర్చాడు. మొత్తంగా రియాన్ మూడు వికెట్లు తీసినట్టయింది.