హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్‌కు భార‌త్‌

Team India squad for Ireland series announced.ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 3:38 AM GMT
హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్‌కు భార‌త్‌

ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్‌ పాండ్యా టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. ఐర్లాండ్‌లో ప‌ర్య‌టించే భార‌త టీ 20 జ‌ట్టు కెప్టెన్‌గా పాండ్యా నియ‌మితుల‌య్యాడు. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌కు వెళ్లే 17 మందితో కూడిన భార‌త జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన పంత్‌కు విశ్రాంతినిచ్చారు. భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ స‌హా ఇంగ్లాండ్‌తో టెస్టులో ఆడే ఆట‌గాళ్లెవ‌రూ టీ20 జ‌ట్టులో లేరు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అదరగొట్టిన మహారాష్ట్ర బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. సంజూ శాంసన్‌కు సెలెక్టర్లు మరోసారి అవకాశమిచ్చారు. జూన్ 26, 28వ తేదీల్లో భార‌త జ‌ట్టు ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. అదే స‌మ‌యంలో భార‌త సీనియ‌ర్ల జ‌ట్టు ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఆడ‌నుంది.

తొలిసారి జట్టుకు ఎంపిక కావడంపై రాహుల్‌ త్రిపాఠి స్పందిస్తూ.. క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కింద‌న్నాడు. చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు. తుది జ‌ట్టులో చోటు ద‌క్కితే స‌త్తా చాటుతాన‌ని అన్నాడు.

భారత జట్టు: హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హూడా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ఖాన్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

Next Story
Share it