T20 ర్యాంకింగ్స్: నెంబర్ వన్‌లో టీమిండియా యువ ప్లేయర్
వన్డే వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో యువ ఆటగాళ్లే ఆడారు.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 11:16 AM GMTT20 ర్యాంకింగ్స్: నెంబర్ వన్‌లో టీమిండియా యువ ప్లేయర్
వరల్డ్ కప్ తర్వాత టీమిండియా సీనియర్లంతా రెస్ట్ తీసుకున్నారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో యువ ఆటగాళ్లే ఆడారు. అయితే.. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లంతా రాణించారు. ముఖ్యంగా భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. ఐదు మ్యాచుల్లో ఏకంగా 9 వికెట్లు తీశాడు. తద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో గత వారం ఐదో స్థానంలో ఉన్నాడు బిష్ణోయ్. అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో రషీద్‌ఖాన్ నిలవగా.. మూడో స్థానంలో వానిందు హసరంగ (శ్రీలంక), నాలుగో స్థానంలో ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), ఐదో స్థానంలో తీక్షణ (శ్రీలంక) వరుసగా నిలిచారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో 9 వికెట్లు తీయడం ద్వారా తొలి స్థానానికి చేరుకున్నాడు రవి బిష్ణోయ్.
మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) రెండో స్థానంలో ఉన్నాడు. మూడోస్థానంలో మార్‌క్రమ్ (దక్షిణాఫ్రికా) నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 223 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఏడో స్థానానికి చేరుకున్నాడు. మూడో టీ20లో చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాది సెంచరీ చేశాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. కాగా.. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహ్మద్ నబీ (అప్ఘానిస్థాన్) మొదటి, రెండో స్థానాల్లో కొనసాగుతున్నారు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది.