టీమిండియా జెర్సీపై ఆసక్తికర చర్చ.. ఆ మూడు స్టార్స్ ఎందుకు?

టీమిండియా ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో ఉంది. ఆ టీమ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2024 7:07 AM IST
team india, jersey, social media, viral,  three stars ,

టీమిండియా జెర్సీపై ఆసక్తికర చర్చ.. ఆ మూడు స్టార్స్ ఎందుకు?

టీమిండియా ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో ఉంది. ఆ టీమ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్‌ పూర్తయింది. ఈ మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. టీమిండియా జెర్సీ గురించి తాజాగా ఓ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఎక్కడ పొరపాటు ఉందబ్బా అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. అసలు ఇంతకు అదేంటంటే..

శుక్రవారం కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ధరించిన జెర్సీ చర్చనీయాంశంగా మారింది. టీమిండియా ఆటగాళ్ల జెర్సీపై మూడు స్టార్లు ఉండటం గుర్తించారు. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి భారత టీ20 జట్టు జెర్సీపై రెండు స్టార్లు ఉంటాయి. 2007, 2024 టీ20 ప్రపంచకప్‌ టైటిళ్లను టీమిండియా గెలిచింది. అందుకు గుర్తుగా రెండు స్టార్లను జెర్సీలపై ఏర్పాటు చేశారు. అయితే వన్డే సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్ల జెర్సీలపై మూడు స్టార్లు ఎందుకు ఉంచారనేది ఆసక్తిగా మారింది. మూడు స్టార్లు ఉన్నాయంటే మూడు ప్రపంచకప్‌లు గెలిచారా..? కానీ.. అది కాదు. ఎందుకంటే భారత్‌ 1983, 2011లో వన్డే ప్రపంచకప్‌ టైటిళ్లను గెలుచుకుంది. పోనీ టీ20 ప్రపంచకప్‌ టైటిళ్లను కూడా జెర్సీపై స్టార్లుగా వేశారా? అప్పుడు స్టార్ల సంఖ్య నాలుగుగా ఉండాలి. అటు నాలుగు కాకుండా.. ఇటు రెండూ కాకుండా మూడు స్టార్లు ఉండటం ఏంటా అని నెటిజన్లు తలలు పీక్కుంటున్నారు? దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది.



ఈ అంశంపై ఒక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2013ను భారత్‌ గెలుచుకుందని చెబుతున్నారు. అందుకే మూడు స్టార్లు ఉన్నాయని చెబుతున్నారు. కానీ.. బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. అటు టైటిల్‌ స్పాన్సర్‌గాని అధికారికంగా స్పందించలేదు. అధికారిక స్పందన వస్తేనే స్టార్లపై ఉన్న గందరగోళం తొలగిపోయే అవకాశం ఉంది.

Next Story