భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2024 7:19 AM IST
team india, former cricketer, anshuman, death,

 భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్‌ కారణంగా అన్షుమాన్ చనిపోయారు. 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై. బ్లడ్‌ క్యాన్సర్‌కు చికిత్స కోసం లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స తర్వాత ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చారు. మెరుగైన వైద్యం పొందినా కూడా అనారోగ్యం నుంచి కోలుకోలేదు. బుధవారం రాత్రి అన్షుమాన్ గౌక్వాడ్ కన్నుమూశారు.

భారత్ తరఫున గైక్వాడ్ మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 1987లో అన్షుమాన్ గైక్వాడ్ చివరిగా వన్డే మ్యాచ్ ఆడారు. 70 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 30.07 సగటుతో 1985 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1982-83లో పాకిస్థాన్‌పై చేసిన 201 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 1997 -2000 మధ్యకాలంలో జాతీయ జట్టు సెలెక్టర్‌గా, ఆ తర్వాత ప్రధాన జట్టుకు హెడ్‌ కోచ్‌గానూ సేవలు అన్షుమాన్ గైక్వాడ్ సేవలు అందించారు.

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. క్రికెట్‌కు అన్షుమాన్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. అన్షుమాన్ మంచి ప్రతిభ ఉన్న క్రికెటర్ అనీ.. అలాగే మంచి కోచ్‌ కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన మరణం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. కష్ట కాలంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

గైక్వాడ్‌ ఆస్పత్రి ఖర్చుల కోసం సాయం అందించాలంటూ బీసీసీఐ అధికారులకు బోర్డు కార్యదర్శి జైషా కూడా ఆదేశాలు జారీ చేశారు. వడోదరలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆర్థిక సాయం చేయాలంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించడంతో బీసీసీఐ ముందుకు వచ్చింది.

Next Story