IND Vs ENG: ఇటు 9 వికెట్లు.. అటు 332 పరుగులు.. రెండో టెస్ట్ ఎవరిదో!
విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 5:17 PM ISTIND Vs ENG: ఇటు 9 వికెట్లు.. అటు 332 పరుగులు.. రెండో టెస్ట్ ఎవరిదో!
విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. అయితే.. ఆదివారం మూడోరోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దాంతో.. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్. మూడో సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మొదట దూకుడుగా ఆడింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. 4.79 రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తోంది. ఇంకా రెండు రోజులు ఆటమిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి ఇంకో 332 పరుగులు అవసరం ఉన్నాయి. మరోవైపు భారత్ గెలవడానికి 9 వికెట్లు తీయాల్సి ఉంది. ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆట ఆడుతుండటంతో రెండో టెస్టు నాలుగో రోజే కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.
సెకండ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులే చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ 13 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 29 పరుగులు చేయగా.. ఒక్క శుభ్‌మన్‌గిల్ 104 పరుగులతో సెంచరీ అందుకున్నాడు. టెస్టుల్లో దాదాపు 12 ఇన్నింగ్స్‌ల తర్వాత రాణించాడు. గిల్‌కు తోడుగా అక్షర్ పటేల్ 45 పరుగులు చేశాడు. ఆఖర్లో అశ్విన్ 29 పరుగులు చేశాడు. దాంతో.. టీమిండియా 299 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా.. మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకొని 399 లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఇక ఇంగ్లండ్ టీమ్‌లో హార్డ్‌లీ 4 వికెట్లు తీయగా.. రెహాన్ 3, అండర్సన్ రెండు వికెట్లు తీశారు.
కాగా.. తొలి టెస్టు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగ్గా.. అందులో ఇంగ్లండ్ గెలిచింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్‌లో గెలుపును మరింత కష్టతరం చేసుకోకుండా 1-1తో సమం చేయాలంటే నాలుగో రోజు భారత బౌలర్లు చెలరగాలి. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేసి.. టార్గెట్‌ను చేరకముందే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.