ఒత్తిడిని తట్టుకోవడం కుర్రాళ్లు అలవాటు చేసుకోవాలి: రోహిత్
శ్రీలంకతో తొలి వన్డేలో విజయానికి దగ్గరగా వచ్చిన టీమిండియా డ్రాగా ముగించింది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 11:20 AM ISTఒత్తిడిని తట్టుకోవడం కుర్రాళ్లు అలవాటు చేసుకోవాలి: రోహిత్
శ్రీలంకతో తొలి వన్డేలో విజయానికి దగ్గరగా వచ్చిన టీమిండియా డ్రాగా ముగించింది. రెండు వికెట్లు చేతిలో ఉండి.. 15 బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేయాల్సి తరుణంలో అంతా టీమిండియాదే గెలుపని భావించారు. కానీ.. చివరకు ఆలౌట్ కావడం అందరినీ నిరాశపర్చింది. ఇలాంటి ఫలితం తమకూ నిరుత్సాహాన్ని కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. చివరికి ఇలాంటి ఫలితం ఎదురుకావడం సరైందేనని పేర్కొన్నాడు.
కొలంబో పిచ్‌పై 230 పరుగుల టార్గెట్‌ను చేదించడానికి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఉత్తమ బ్యాటింగ్ చేస్తే కష్టమైన టార్గెట్ కాదన్నాడు. టార్గెట్ చేధనలో భాగంగా ఆరంభంతో పాటు మిడిల్ ఆర్డర్‌లో కూడా బాగానే ఆడారని చెప్పాడు. అయితే.. మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తామనే ఊపు కనిపించిందని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. శ్రీలంక స్పిన్నర్లు రాకముందు వరకు మ్యాచ్‌పై పట్టు సాధించాలని ముందే భావించామన్నాడు. అదే ధోరణిలో దూకుడు ప్రదర్శించినట్లు చెప్పాడు. కానీ.. వెనువెంటనే వికెట్లను కోల్పోవడం నష్టం చేకూర్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ భాగస్వామ్యంతో మరోసారి ఫామ్‌లోకి వచ్చామనిపించిందని చెప్పాడు. కానీ.. శ్రీలంక స్పిన్నర్లు మళ్లీ రాణించి వికెట్లు తీశారని పేర్కొన్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఒత్తిడిని తట్టుకోవడం కుర్రాళ్లు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక్క పరుగు కూడా సాధిస్తే బాగుండేదని.. ఇరుజట్లు విజయం కోసం బాగా పోరాడాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.