ధోని రికార్డును దాటేసిన రోహిత్ శర్మ

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు.

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 5:15 PM IST
team india, captain rohit sharma, dhoni, record ,

ధోని రికార్డును దాటేసిన రోహిత్ శర్మ

గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రోహిత్‌ ధోనిని అధిగమించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌ టాప్‌లో ఉన్నాడు. సెహ్వాగ్‌ 91 సిక్సర్లను 178 ఇన్నింగ్స్‌ లో బాదగా.. రోహిత్‌ శర్మ 79 సిక్సర్లను 97 ఇన్నింగ్స్‌ల్లో కొట్టాడు. ఇక ధోని 78 సిక్సర్లను కొట్టడానికి 144 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు రోహిత్‌ శర్మ. హిట్‌మ్యాన్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ సెంచరీ. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 47వది. కెప్టెన్‌గా అతనికి ఇది 10వ సెంచరీ. రోహిత్‌ ఈ సెంచరీతో భారత్‌ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్ గా నిలిచాడు. హిట్‌మ్యాన్‌ 36 ఏళ్ల 291 రోజుల వయసులో భారత కెప్టెన్‌గా సెంచరీ కొట్టాడు. ఇంత లేటు వయసులో ఏ భారత కెప్టెన్‌ కూడా సెంచరీ చేయలేదు.

టెస్ట్‌లు, ODIలు, T20Iలలో కలిపి 590 సిక్సర్లను కొట్టిన రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సిక్సర్లను కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ T20Iలలో 143 ఇన్నింగ్స్‌లలో 190 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక వన్డే క్రికెట్‌లో 254 ఇన్నింగ్స్‌లలో 323 సిక్సర్లను కొట్టి ఆ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది, అతను 179 ఇన్నింగ్స్‌లలో 128 సిక్సర్లు కొట్టాడు. అతని తర్వాత బ్రెండన్ మెకల్లమ్ (176 ఇన్నింగ్స్‌ల్లో 107 సిక్స్‌లు), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (137 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్స్‌లు) ఉన్నారు.

Next Story