ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా.. రెండు సీజ‌న్‌ల‌ ముందుగానే వీడుతున్న వివో

Tata set to replace VIVO as IPL's title sponsor. ఐపీఎల్‌- 2022 సీజన్ కు టైటిల్ స్పాన్సర్‌గా టాటా వ్య‌వ‌హ‌రించ‌నుంది. దీంతో చైనీస్ మొబైల్

By Medi Samrat  Published on  11 Jan 2022 4:16 PM IST
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా.. రెండు సీజ‌న్‌ల‌ ముందుగానే వీడుతున్న వివో

ఐపీఎల్‌- 2022 సీజన్ కు టైటిల్ స్పాన్సర్‌గా టాటా వ్య‌వ‌హ‌రించ‌నుంది. దీంతో చైనీస్ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం వివో తో ఐపీఎల్ కు ఉన్న బంధం ముగియనుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో స్పాన్సర్‌షిప్ మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెరుగుతున్న చైనా వ్యతిరేక సెంటిమెంట్ కారణంగా వివో 2020లో ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్ నుండి వైదొలిగింది. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. 2021లో వివో తిరిగి చీఫ్ స్పాన్సర్‌గా ఉండగా.. తాజాగా 2022 ఐపీఎల్‌ ఎడిషన్ కంటే ముందే బీసీసీఐ వివో స్పాన్సర్ షిప్‌కు ముగింపు ప‌ల‌క‌నుంది. ఇదిలావుంటే.. వివో, బీసీసీఐ 2018లో ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం 440 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్పాన్సర్‌షిప్ ఒప్పందం ఐపీఎల్‌ 2023 సీజన్ తర్వాత ముగియాల్సి ఉంది. తాజా ప‌రిస్థితుల దృష్ట్యా రెండు సీజ‌న్‌ల‌ ముందుగానే వీడిపోతుంది.

ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐతో ఇప్పటికే ఉన్న ఒప్పందాన్ని టాటాకు బదిలీ చేయాలని వివో అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. టాటా 2022, 2023 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. అయితే.. ఈ రెండు సీజన్‌లకు సంబంధించిన ఆర్థిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. 2023 సీజన్ తర్వాత, స్పాన్సర్‌షిప్ ఒప్పందం మరోసారి పట్టాలెక్కుతుంది. "ఐపిఎల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం నుండి వైదొలగాలని వివో నుండి అభ్యర్థన వచ్చింది. గవర్నింగ్ కౌన్సిల్ దానిని ఆమోదించింది" అని ఓ అధికారి క్రిక్‌బజ్‌తో అన్నారు. వివో నిష్క్రమించింది.. టాటా టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుందని ఐపీఎల్‌ ఛైర్మన్ ధృవీకరించారు.


Next Story