టీ20 వరల్డ్ కప్ 2026: పాకిస్థాన్ 'యూ-టర్న్'.. భారత్‌తో మ్యాచ్‌కు పచ్చజెండా!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన...

By -  అంజి
Published on : 10 Feb 2026 6:39 AM IST

India vs Pakistan, T20 World Cup 2026, ICC, Cricket Boycott

టీ20 వరల్డ్ కప్ 2026: పాకిస్థాన్ 'యూ-టర్న్'.. భారత్‌తో మ్యాచ్‌కు పచ్చజెండా!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని గతంలో హెచ్చరించిన పాకిస్థాన్ ప్రభుత్వం, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఐసీసీ (ICC) అధికారులతో జరిపిన చర్చల అనంతరం, షెడ్యూల్ ప్రకారం భారత్‌తో తలపడాలని పాక్ క్రికెట్ బోర్డును (PCB) ఆదేశించింది.

అసలేం జరిగింది?

భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా పాకిస్థాన్ ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. అయితే, గత కొన్ని రోజులుగా ఐసీసీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం లాహోర్‌లో పీసీబీ అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయి. క్రికెట్ స్పూర్తిని కాపాడేందుకు, అంతర్జాతీయ క్రీడల కొనసాగింపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది.

బంగ్లాదేశ్ విజ్ఞప్తితో మారిన సమీకరణాలు

వాస్తవానికి పాకిస్థాన్ ఈ మొండిపట్టు పట్టడానికి కారణం బంగ్లాదేశ్. కానీ, స్వయంగా బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడమని కోరడం ఇక్కడ విశేషం. "క్రికెట్ పర్యావరణ వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా పాక్ ఈ మ్యాచ్ ఆడాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి తోడు శ్రీలంక, యూఏఈ వంటి మిత్ర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను కూడా పాక్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.

బంగ్లాదేశ్‌పై ఐసీసీ ఉదారత

భారత్‌లో ఆడనని చెప్పిన బంగ్లాదేశ్‌పై ఐసీసీ ఎటువంటి జరిమానా విధించకూడదని నిర్ణయించింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి చేర్చినప్పటికీ, భవిష్యత్తులో (2028-2031 మధ్య) బంగ్లాదేశ్‌కు ఒక ఐసీసీ ఈవెంట్ ఆతిథ్య హక్కులు కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.

సల్మాన్ మీర్జా స్పందన

ప్రస్తుతం కొలంబోలో ప్రాక్టీస్‌లో ఉన్న పాక్ పేసర్ సల్మాన్ మీర్జా మాట్లాడుతూ, "ప్రభుత్వ నిర్ణయమే మాకు శిరోధార్యం. ప్రస్తుతానికి మా దృష్టి అమెరికాతో జరిగే తదుపరి మ్యాచ్‌పైనే ఉంది. ఆ తర్వాతే భారత్ మ్యాచ్ గురించి ఆలోచిస్తాం" అని పేర్కొన్నారు.

Next Story