టీ20 వరల్డ్ కప్ ఫైనల్: అహ్మదాబాద్ పిచ్ ఎవరికి ఫేవరెట్?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సమయం దగ్గరపడుతోంది.
By - అంజి |
టీ20 వరల్డ్ కప్ ఫైనల్: అహ్మదాబాద్ పిచ్ ఎవరికి ఫేవరెట్?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలుపోటములను శాసించేది ఆటగాళ్ల ఫామ్ మాత్రమే కాదు, అక్కడి 'పిచ్' కూడా.. ఈ స్టేడియంలోని పిచ్ మిగతా స్టేడియాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎర్ర మట్టి , నల్ల మట్టి, ఈ రెండింటి కలయికతో కూడిన హైబ్రిడ్ పిచ్‌లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఫైనల్ మ్యాచ్ కోసం ఎర్ర మట్టి, నల్ల మట్టి కలిపిన హైబ్రిడ్ పిచ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది సాధారణంగా నెమ్మదిగా ఉండి, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.
ఈ టోర్నీ సూపర్-8 దశలో ఇదే స్టేడియంలో నల్ల మట్టి పిచ్‌పై సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇది మంచి పేస్, బౌన్స్‌ను ఇస్తుంది. ఫలితంగా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ కోసం ఎంచుకున్న ఈ మిశ్రమ పిచ్ వల్ల అటు బ్యాటర్లకు పరుగులు వస్తాయి, ఇటు బౌలర్లకు (ముఖ్యంగా పేసర్లకు) మంచి బౌన్స్ లభిస్తుంది. ఈ పిచ్ గనుక ఆశించిన విధంగా స్పందిస్తే, ఇరు జట్లలోని నాణ్యమైన పేసర్లు విరుచుకుపడే అవకాశం ఉంది. టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతితో ప్రమాదకరంగా మారవచ్చు. బుమ్రాకు తన సొంత మైదానం కావడంతో ఇక్కడి పరిస్థితులపై పట్టు ఉంది.
ఇక స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు న్యూజిలాండ్ పేసర్లు మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్ కూడా బౌన్స్‌ను ఉపయోగించుకోవడంలో దిట్టలు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పిన్ మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 254 పరుగుల రికార్డ్ స్కోరు చేసిన భారత్, అదే జోరుతో సొంత గడ్డపై టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. అదే సమయంలో సెమీస్‌లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిన కివీస్, తమ తొలి టీ20 వరల్డ్ కప్ అందుకోవాలని తహతహలాడుతోంది.