వరల్డ్‌కప్‌లో థ్రిల్లర్ మ్యాచ్‌.. బంగ్లాపై విజయంతో సెమీస్‌కు అప్ఘాన్

బంగ్లాదేశ్ తో మ్యాచ్‌ ఆడింది అప్ఘానిస్థాన్. థ్రిల్లర్‌లాగా సాగిన ఈ మ్యాచ్‌లో అప్ఘాన్ చివరకు విజయాన్ని అందుకుంది.

By Srikanth Gundamalla  Published on  25 Jun 2024 11:17 AM IST
t20 world cup, Bangladesh vs Afghanistan, semifinals,

వరల్డ్‌కప్‌లో థ్రిల్లర్ మ్యాచ్‌.. బంగ్లాపై విజయంతో సెమీస్‌కు అప్ఘాన్

టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు జరిగాయి. పసికూన టీమ్‌లు కూడా రికార్డులు నమోదు చేశాయి. బ్యాటింగ్.. బౌలింగ్‌లో బలంగా ఉన్న ఆస్ట్రేలియాపై అప్ఘానిస్థాన్ విజయం సాధించి షాక్‌ ఇచ్చింది. తాజాగా అప్ఘానిస్థాన్ సెమీస్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది. మంగళవారం తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తో మ్యాచ్‌ ఆడింది అప్ఘానిస్థాన్. థ్రిల్లర్‌లాగా సాగిన ఈ మ్యాచ్‌లో అప్ఘాన్ చివరకు విజయాన్ని అందుకుంది. 8 పరుగుల తేడాతో డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం గెలిచింది. సెమీస్‌లో ఆడేందుకు అర్హతను సాధించింది. ఇక అప్ఘానిస్థాన్‌ గెలుపుతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

కింగ్స్‌టౌన్‌ వేదికగా జరిగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అప్ఘానిస్తాన్ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 115 పరుగులు చేసింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌ కావడంతో అప్ఘాన్‌ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. గుర్బాజ్‌ 53 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇబ్రహీం జద్రాన్ 18, రషీద్ ఖాన్ 19 పరుగులు చేశారు. చివర్లో రషీద్‌ మూడు సిక్సర్లు కొట్టడంతో కాస్త స్కోరు బోర్డు ముందుకు కదిలింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్‌ హుసేన్ మూడు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ పడగొట్టారు.

116 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్‌ బరిలోకి దిగింది. అయితే.. ఆదిలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో 13 ఓవర్లలోపే లక్ష్యాన్ని చేధిస్తే బంగ్లాదేశ్‌ కూడా సెమీఫైనల్‌ చేరే అవకాశం ఉండేది. ఆ జట్టు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాటింగ్ చేసింది. కానీ.. వరుసగా వికెట్లు పడిపోవడంతో చివరకు ఓటమి అంచులకు వెళ్లింది. ఓపెనర్ లిటన్ దాస్‌ చివరి వరకు పోరాడాడు. 49 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ అప్ఘాన్‌ ఒక వైపు నుంచి పట్టువదల్లేదు. 17.5 ఓవర్లలో 105 పరుగులకు బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చింది. మ్యాచ్‌ను వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించారు. దాంతో డీఎల్‌ఎస్‌ టార్గెట్‌ 114గా నిర్ణయించారు. బంగ్లాదేశ్‌ 17.5 ఓవర్లకు 105 పరుగులు చేసి ఆలౌట్‌ కావడంతో.. 8 పరుగుల తేడాతో అప్ఘానిస్థాన్ విజయం సాధించింది. తద్వారా సెమీస్‌కు వెళ్లింది. చివరి వరకు ఓపెనర్ క్రీజులో ఉండటంతో మ్యాచ్‌ రసవత్తరంగా కనిపించింది. టీ20 వరల్డ్‌కప్‌లో అప్ఘానిస్థాన్ టీమ్‌ తొలిసారి సెమీస్‌కు చేరి రికార్డును సృష్టించింది.

మరోవైపు ఐసీసీ టోర్నీలో విజయవంతమైన జట్టుగా ఉన్నఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగింది. సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్‌లు తలపడనున్నాయి.

Next Story