కొత్త ఛాంపియన్‌పై ఉత్కంఠ.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడే
T20 World Cup 2021 Final Match Today.తొలిసారి టి20ల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు అటు ఆస్ట్రేలియా ఇటు
By తోట వంశీ కుమార్ Published on 14 Nov 2021 9:35 AM ISTతొలిసారి టి20ల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు అటు ఆస్ట్రేలియా ఇటు న్యూజిలాండ్ జట్లు సై అంటున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచినా కూడా ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్ అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ జట్టు పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. మరో వైపు గత రెండు వన్డే ప్రపంచకప్‌లలో పైనల్ చేరి తుది సమరంలో ఓటమి పాలైన న్యూజిలాండ్ ఈ ఏడాది టెస్టు ఛాంపియన్‌గా నిలిచింది. అదే ఊపులో టీ20 ప్రపంచకప్ పైనల్ చేరిన ఆ జట్టు.. టైటిల్‌ను ఎత్తుకోవాలని ఆశపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా నేడు(ఆదివారం) రాత్రి 7.30గంటలకు పైనల్ మ్యాచ్ జరగనుంది. తుది సమరంలో గెలిచి ఎవరు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడుతారోనని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బలమైన బ్యాటింగ్‌ను నమ్ముకుని ఆస్ట్రేలియా బరిలోకి దిగుతుండగా.. వైవిధ్యమైన బౌలింగ్‌తో నమ్ముకున్న కివీస్ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక 2015లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో తమను ఓడించిన ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకోవాలని విలియమ్ సన్ సేన బావిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో రెండో సారి ఫైనల్ చేరిన ఆసీస్.. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టిపట్టుదలతో ఉంది. 2010లో పొట్టి ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది.
ఇక సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఆసీస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో వార్నర్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, వేడ్ కీలకం కానున్నారు. టోర్నీ ముందు ఫేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన వార్నర్ ఇప్పడు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదకుండా చివరి వరకూ ఉండి జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా గేర్ మార్చి ఆడుతున్నాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 236 పరుగులు చేసి ఆ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే.. కెప్టెన్ అరోన్ ఫించ్ ఫామ్ ఆస్ట్రేలియాను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటి వరకు ఫించ్ తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. ఫైనల్‌లో ఫించ్ చెలరేగాలని ఆ జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. వార్నర్‌తో పాటు ఫించ్ చెలరేగితే కివీస్‌కు మరిన్ని కష్టాలు తప్పవు. మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌లతో పాటు సెమీస్ మ్యాచ్ హీరో మాథ్యూ వేడ్ లతో ఆసీస్ బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది.
ఇక కివీస్ విషయానికి వస్తే.. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, మిచెల్, విలియమయ్ సన్, నీషమ్‌పైనే ఆ జట్టు బ్యాటింగ్ భారం ఉంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై మంచి ప్రదర్శన చేయడంతో పాటు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే కాన్వే గాయంతో ఫైనల్ ఆడలేకపోవడం కివీస్‌కు పెద్ద దెబ్బే. అతడి స్థానంలో సీఫర్ట్ జట్టులోకి రానున్నాడు. అయితే కాన్వేతో పోలిస్తే బ్యాటింగ్‌లో సీఫెర్ట్ కాస్త బలహీనం. బ్యాటింగ్‌లో ఎలా రాణిస్తారు అన్నదానిపైనే కివీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో ఆసీస్ కంటే కివీస్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. బౌల్ట్, సౌథితో పాటు మిల్నె, స్పిన్నర్లు సోధి, శాంట్నర్ తో కూడిన న్యూజిలాండ్ బౌలింగ్ దుర్భేధ్యంగా ఉంది. మరోవైపు ఆసీస్ బౌలర్లలో జంపా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. పేస్ త్రయం మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ ఫైనల్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి మరీ.