మాట నిల‌బెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. న‌ట్టూ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు

T Natarajan receives SUV. ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుని, ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ఎస్‌యూవీ థార్ వాహనాలను బహుమతులుగా అందించారు.

By Medi Samrat  Published on  2 April 2021 4:54 AM GMT
T Natarajan receives SUV

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న దృష్టికి వ‌చ్చిన ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసి.. త‌న వంతుగా సాయం చేస్తూ.. చాలా మందికి అండ‌గా నిలుస్తారు. అంతేకాదు క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డంలోనూ ఆనంద్ మహీంద్రా ముందుంటారు.


తాజాగా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుని మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు బహుమతులు ఇస్తానని ప్ర‌క‌టన చేసిన‌ సంగ‌తి తెలిసిందే. మాట ప్ర‌కారం.. ఆయ‌న సంస్థకు చెందిన ఎస్‌యూవీ థార్ వాహనాలను బహుమతులుగా అందించారు. తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా యువ ‌ బౌలర్‌ నటరాజన్ సంతోషం వ్య‌క్తం చేశాడు. అంతేకాదు పనిలో ప‌నిగా ఆనంద్ ‌మహీంద్రాకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు.

ఈ సంద‌ర్భంగా నటరాజన్ ట్విట‌ర్ వేదిక‌గా..`నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు సర్. టీమిండియా తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నాకు దక్కిన వరం. గొప్ప వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభించడం నాకు దక్కిన గౌరవం. నాకు మీరు బహుమతిగా ఇచ్చిన వాహనాన్ని ఈ రోజే నడిపాను. నా అరంగేట్ర టెస్ట్‌ మ్యాచ్‌ జెర్సీని మీకోసం పంపిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

ఇదిలావుంటే.. తమిళనాడుకు చెందిన నటరాజన్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌తోనే వ‌న్డే, టెస్టు, టీ20ల‌లో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంగ్రేటంలోనే తొమ్మ‌ది వికెట్లు తీసి రాణించాడు. ఇక‌ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని సేలంలోని స్వగ్రామానికి చేరుకున్న నటరాజన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆ స్వాగ‌త కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఫోటోలు నెట్టింట వైర‌ల‌య్యాయి. ఇక‌ నటరాజన్‌తోపాటు వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైనీలు థార్ వాహనాలను బహుమతులుగా అందుకున్నారు.


Next Story
Share it