సమకాలీన క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా నిలిచింది ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్. తాజాగా ఆమె మరో అరుదైన ఘనతను సాధించింది. ఇంగ్లాండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్ వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేయనుంది. చరిత్రలో తొలిసారి ఓ మహిళా.. పురుషుల జట్టు కోచ్‌గా వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ససెక్స్‌లో ప్రతిభావంతులైన వికెట్ కీపర్ల బృందం ఉందని.. వారితో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. నా అనుభవం, నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నించనున్నట్లు వెల్లడించింది సారా టేలర్.
ఇంగ్లాండ్ తరుపున సారా 10 టెస్టులు ఆడి 300 పరుగులు, 126 వన్డేల్లో 20 అర్థశతకాలు, 7 సెంచరీలు బాది 4,056 పరుగులు, 90 టీ20ల్లో 16 అర్థశతకాలు బాది 2,177 పరుగులు చేసింది. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టపింగ్స్, 128 క్యాచులు అందుకుంది. ఇంగ్లాండ్ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలవడంలో సారా టేలర్ కీలకపాత్ర పోషించింది. అనంతరం కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న టైమ్‌లో మానసిక ఆరోగ్య సమస్యలతో 2019లో 30 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది.