అబ్బాయిలకు అవగాహన కల్పించాలి.. ట్రైనీ డాక్టర్ ఘటనపై సూర్యకుమార్ మెసేజ్
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 8:02 AM ISTఅబ్బాయిలకు అవగాహన కల్పించాలి.. ట్రైనీ డాక్టర్ ఘటనపై సూర్యకుమార్ మెసేజ్
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెను అతి దారుణంగా అత్యాచారం చంపేశారు. ఈ సంఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే బాధితురాలికి న్యాయం జరగాలంటూ దేశంలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. మరోవైప ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారు. మరోవైపు కొందరైతే సమాజానికి మెసేజ్‌లు ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న అమ్మాయిలు, బాలికలకు ఎలా రక్షించుకోవాలి అనేదాని గురించి అవగాహన కల్పించడం మాత్రమే కాదు.. ఇంట్లో ఉన్న అబ్బాయిలకు కూడా అవగాహన పెంచాలని సూచిస్తున్నారు.
తాజాగా ఈ సంఘటనపై టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మేరకు సమాజానికి మేసేజ్ ఇచ్చాడు. ‘‘మీ కొడుకులకు, మీ సోదరులకు, మీ తండ్రులకు, మీ భర్తలకు, మీ స్నేహితులకు అవగాహన కల్పించండి’’ అని తన సందేశాన్ని పంచుకున్నాడు. ‘‘మీ కూతురిని రక్షించుకోవడం కాదు. మీ కొడుకుకి అవగాహన కల్పించండి’’ అంటూ ఒక టెంప్లేట్‌ను షేర్ చేశాడు. కోల్‌కతా సంఘటన నేపథ్యంలో సూర్యకుమార్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆయన పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.
కాగా.. కోల్‌కతా హత్యాచారం ఘటనపై సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ రజమా స్పందించారు. మరికొందరు స్టార్ ప్లేయర్లు కూడా ఈ ఘటనను ఖండించారు. రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటి అలియా భట్ పోస్ట్‌ను జస్పీత్ బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ‘‘మరో క్రూరమైన అత్యాచారం ఇది. మహిళలకు ఎక్కడా భద్రత లేదని గ్రహించిన మరో రోజు ఇది. నిర్భయ దుర్ఘటన జరిగి దశాబ్దం దాటినా ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదని గుర్తుచేసే మరో భయంకరమైన దారుణం ఇది’’ అని ఆ పోస్టులో ఉంది. ఇక సిరాజ్ తన పోస్టులో ఇలా రాసుకొచ్చాడు. ‘‘ మరి ఈసారి తప్పు ఎవరిదని అంటారు. ఇంకా ఆమెదే తప్పు అంటారా. ఎందుకంటే మగాడు మగాడే కాబట్టి, అంతేనా?’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.