దీపక్ చాహర్, సూర్య కుమార్ యాదవ్.. శ్రీలంకతో టీ20 సిరీస్ కు మిస్..?

Suryakumar Yadav And Deepak Chahar Ruled Out Of The T20I Series.టీమ్ ఇండియా వైట్ బాల్ స్పెషలిస్ట్‌లు

By M.S.R  Published on  23 Feb 2022 10:30 AM IST
దీపక్ చాహర్, సూర్య కుమార్ యాదవ్.. శ్రీలంకతో టీ20 సిరీస్ కు మిస్..?

టీమ్ ఇండియా వైట్ బాల్ స్పెషలిస్ట్‌లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ శ్రీలంకతో జరగబోయే T20I సిరీస్‌కు దూరమవ్వనున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి T20Iలో బౌలింగ్ చేస్తున్నప్పుడు చాహర్‌కు హ్యామ్ స్టింగ్ గాయం కావడంతో సిరీస్‌కు ముందే దూరమవుతున్నట్లు స్పష్టమైంది. ఇక సూర్యకుమార్ చేతిపై హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ అధికారి చాహర్ కు సంబంధించిన వార్తలను PTIకి ధృవీకరించారు. పేసర్ దీపక్ చాహర్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో తిరిగి ఫిట్నెస్ సొంతం చేసుకుంటాడని చెప్పారు. "దీపక్ చాహర్ సిరీస్ ఆడడం లేదు. NCAలో అతను ఉంటాడు" అని BCCI అధికారి ఒకరు తెలిపారు. మూడో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఓపెనర్లను తక్కువ స్కోర్ కే అవుట్ చేసిన తర్వాత, చాహర్ తన రెండవ ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం నుండి బయటికి వెళ్లిపోయాడు. దీపక్ కుడి కాలులోని కండరం పైకి లాగినట్లు అనిపించడంతో.. అతడు నేలపై కూర్చున్నాడు. ఫిజియో మైదానానికి పరుగెత్తుకుని వచ్చి చాహర్ ను తీసుకుని వెళ్ళాడు. ఇక మార్చి చివరి వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు చాహర్ ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాలి. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే జట్టులో ఉండడంతో రీప్లేస్మెంట్ కోరలేదని అధికారి తెలిపారు. బుమ్రాతో పాటు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు భారత్‌లో భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ కూడా అందుబాటులో ఉన్నారు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, సూర్యకుమార్ శ్రీలంక సిరీస్ కు ముందు లక్నోలో ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు. కానీ ఇప్పుడు అతను ఫిట్ గా లేనట్లు తెలుస్తోంది. విండీస్‌తో జరిగిన మూడో T20I సమయంలో ఫీల్డింగ్ సమయంలో 31 ఏళ్ల సూర్య గాయపడ్డాడని నివేదిక సూచించింది. బయో-బబుల్ ప్రోటోకాల్‌ల కారణంగా.. భారతజట్టులో ఇప్పటికే తగినంత బ్యాకప్ ఎంపికలను కలిగి ఉంది. దీంతో BCCI ఎటువంటి ప్రత్యామ్నాయాలను ప్రకటించకపోవచ్చు. శ్రీలంకతో టీ20 అంతర్జాతీయ సిరీస్ గురువారం లక్నోలో ప్రారంభం కానుంది. తదుపరి రెండు టీ20లు ధర్మశాలలో ఫిబ్రవరి 26, 27 తేదీల్లో జరగనున్నాయి.

Next Story