మూడో వన్డేలో ఆఖరి మూడు ఓవర్లు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో విజయం భారత్ ను వరించింది. మూడో వన్డేలో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో నెగ్గి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. 330 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ చివరి వరకు ఇంగ్లండ్ ను రేస్ లోనే ఉంచాడు. 8వ స్థానంలో వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇన్నింగ్స్ 50వ ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులు చేయగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓటమిపాలైంది. వీరోచితంగా పోరాడిన శామ్ కరన్ 95 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. కరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెయిర్ స్టో కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
శార్దూల్ ఠాకూర్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేస్తారని తాను భావించానని మ్యాచ్ అనంతరం కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందుకు భిన్నంగా శామ్ ను ఎంపిక చేయడంతో కొద్దిగా షాక్ నకు గురయ్యానని అన్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం కష్టమని వ్యాఖ్యానించాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అత్యధిక వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేస్తారని భావించానని అన్నాడు. ఓటమి పాలైన జట్టులో ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో పలువురు క్రికెటర్లకు ఓడిపోయిన తరువాత కూడా లభించింది. మూడో వన్డే మ్యాచ్ లో జట్టు విజయానికి బాటలు వేసిన శార్దూల్ కు బదులుగా శామ్ కరన్ ను అవార్డుకు ఎంపిక చేయడం కోహ్లీకి అసంతృప్తిని కలిగించింది.