IPL 2025 : పంజాబ్ ఫైనల్‌కు వెళ్తుంది.. 300 పరుగులు చేసే శక్తి ఆ ఒక్క జట్టుకు మాత్రమే ఉంది

IPL 2024లో అనేక కొత్త రికార్డులు వెలుగు చూశాయి. 22 మార్చి 2025 నుండి ప్రారంభమయ్యే 18వ సీజన్‌లోనూ కొత్త రికార్డులు న‌మోదు కానున్నాయి.

By Medi Samrat
Published on : 21 March 2025 10:01 AM IST

IPL 2025 : పంజాబ్ ఫైనల్‌కు వెళ్తుంది.. 300 పరుగులు చేసే శక్తి ఆ ఒక్క జట్టుకు మాత్రమే ఉంది

IPL 2024లో అనేక కొత్త రికార్డులు వెలుగు చూశాయి. 22 మార్చి 2025 నుండి ప్రారంభమయ్యే 18వ సీజన్‌లోనూ కొత్త రికార్డులు న‌మోదు కానున్నాయి. అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 300 పరుగుల మార్కును దాటగలదని భారత మాజీ క్రికెటర్ హనుమ విహారి అన్నాడు. గత సీజన్‌లో RCBపై హైదరాబాద్ 287 పరుగులు చేసింది. ఆరెంజ్ ఆర్మీ విధ్వంస‌క‌ర‌ బ్యాటింగ్ లైనప్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 300 పరుగుల మార్కును దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని విహారి చెప్పాడు.

జియోస్టార్‌లోని కామెంటరీ ప్యానెల్‌లో హనుమ విహారి మాట్లాడుతూ.. 'ఇషాన్ కిషన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అద్భుతమైన ఆరంభాన్ని అందించగ‌ల‌రు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో ఉండడంతో ఈ జట్టు 300 పరుగుల మార్కును దాటగలదు. బ్యాటింగ్ పిచ్‌ల‌పై ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.

హనుమ విహారి ఐపీఎల్ 2025 కోసం ఇద్దరు ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోందని.. పంజాబ్ కింగ్స్ కూడా తమజ‌ట్టు కూర్పును అన్ని విధాల‌ కవర్ చేసిందని విహారి అభిప్రాయపడ్డాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. జట్టులో స‌భ్యులు స్వేచ్ఛగా ఆడేందుకు అనుమతించినందుకు కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాలి. ప్రస్తుత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తుంద‌న్న నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

పంజాబ్ కింగ్స్ పటిష్టంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ IPL విజేత కెప్టెన్. రికీ పాంటింగ్ గొప్ప కోచ్. గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ కారణంగా వారి బ్యాటింగ్ బలంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని నేను నమ్ముతున్నానన్నాడు.

అందరి చూపు యువకుడు నితీష్ కుమార్ రెడ్డిపైనే ఉంటుందని హనుమ విహారి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. నితీష్‌కు మంచి సీజన్ వచ్చింది. అతడు దేశం తరఫున అరంగేట్రం చేసి మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ సాధించాడు. టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. అతడి వయసు ఇంకా 21 ఏళ్లు కాబట్టి అతడిపై ఫ్రాంచైజీ, అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరంగా మారనుంద‌న్నాడు.

హనుమ విహారి మాట్లాడుతూ.. 'ఈ సీజన్‌లో అతడు పరుగులు సాధిస్తే.. వచ్చే 10 సంవత్సరాల వరకు అతన్ని ఎవరూ ఆపలేరు. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌కు హర్షల్ పటేల్ మంచి ప్రత్యామ్నాయమని విహారి చెప్పాడు. ఇది కాకుండా ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లను చేర్చడం ద్వారా జట్టు తన స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసిందన్నాడు.

Next Story