సన్ రైజర్స్ ఫినిషింగ్ సమస్య నుండి ఎప్పుడు బయటపడుతుందో..!
Sunrisers Hyderabad Finishing Problem. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచుల్లో ఫినిషింగ్ విషయంలో మాత్రం తేడా కొడుతూనే ఉంది.
By Medi Samrat Published on 12 April 2021 9:50 AM ISTసన్ రైజర్స్ హైదరాబాద్.. అద్భుతమైన బౌలర్లు, మంచి బ్యాట్స్మెన్.. లోకల్ ట్యాలెంట్ కు కూడా కొదవలేదు. కానీ మ్యాచుల్లో ఫినిషింగ్ విషయంలో మాత్రం తేడా కొడుతూనే ఉంది. ఎప్పుడు చూసినా సన్ రైజర్స్ మ్యాచ్ లను ఫినిషింగ్ చేయలేకపోవడానికి కారణం సరైన ఫినిషర్ లేకపోవడమే..! ఢిల్లీకి పంత్ లాగా.. చెన్నైకి ధోని లాగా.. ముంబైకి పోలార్డ్ లాగా.. సన్ రైజర్స్ కు ఒక్క ఫినిషర్ కూడా ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. వేలంపాటలో తీసుకున్న ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం కూడా సన్ రైజర్స్ ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫినిషింగ్ చేయలేక చేతులెత్తేసింది. ఒకానొక దశలో ఈజీగా మ్యాచ్ ను ముగించేయొచ్చు అని అనుకున్నా.. సరైన హిట్టర్ లేకపోవడం విజయావకాశాలపై ప్రభావం చూపింది.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా 56 బంతుల్లోనే 80 పరుగులతో రాణించాడు. రాణా స్కోరులో 9 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. వన్ డౌన్ బ్యాట్స్ మన్ రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడాడు. త్రిపాఠి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రే రస్సెల్ మరోసారి విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. భువీ, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భువీ భారీగా పరుగులు ఇవ్వడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది.
లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్... ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. వృద్ధిమాన్ సాహా ను షకీబల్ హసన్ పెవిలియన్ కు పంపాడు. జానీ బెయిర్ స్టో (55) హాఫ్ సెంచరీ సాధించినా, విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. మనీష్ పాండే 61 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. పాండే, బెయిర్ స్టో జోడీ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత వరుసగా వికెట్లు పడుతూ ఉండటంతో రన్ రేట్ పెరిగిపోయి, మిగతా వారిపై ఒత్తిడి పెరిగింది. యువ ఆటగాడు అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేసినప్పటికీ 188 పరుగులను మాత్రం ఆ జట్టు అందుకోలేక పరాజయం పాలైంది. మనీష్ పాండే కాస్త దూకుడుగా ఆడినా.. సమద్ కాస్త ముందు బ్యాటింగ్ కు దిగినా సన్ రైజర్స్ ఖాతాలో రెండు పాయింట్లు వచ్చేవి అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.