SA20 2025-26 సీజన్ ఆదివారం కేప్ టౌన్‌లో ముగిసింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. నాలుగు సంవత్సరాలలో ఈస్టర్న్ కేప్‌కు ఇది మూడవ SA20 టైటిల్. ఈ విజయం టోర్నీలో ఈస్టర్న్ కేప్‌ను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపింది.
159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ జట్టు ఇన్నింగ్సు పేలవంగా ప్రారంభమైంది. 8.4 ఓవర్లలో 48/4 కష్టాల్లో పడింది. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (63 నాటౌట్), మాథ్యూ బ్రీట్జ్కే (68 నాటౌట్) రాణించారు. ఈ జంట ఐదవ వికెట్‌కు అజేయంగా 114 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి.. నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో జట్టు విజయం సాధించడంలో సహాయపడింది. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు అవసరం కాగా స్టబ్స్.. బ్రైస్ పార్సన్స్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. విజయం సాధించడంతో సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ తన సీటు నుండి దూకి ఆనందంతో గంతులు వేసింది. వైరల్ అయిన వీడియోలో ఆమె మూడవ టైటిల్‌ను సూచించే 'త్రీ' గుర్తును చూపిస్తూ కనిపించింది.
అంతకుముందు ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున డెవాల్డ్ బ్రెవిస్ 56 బంతుల్లో 101 పరుగులు చేసి తమ జట్టు 158/7 స్కోరును చేరుకోవడానికి సహాయం చేశాడు. అయితే.. చివరి ఓవర్లలో వికెట్లు పడిపోవడం.. పరుగుల వేగం మందగించడంతో ప్రిటోరియా క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించలేకపోయింది. "నేను చాలా సంతోషంగా ఉన్నాను.. మాటల్లో చెప్పలేను" అని మ్యాచ్ తర్వాత స్టబ్స్ అన్నాడు. "మేము దీన్ని ఎలా చేసామో నాకు తెలియదు. మాటీ, నేను ప్రశాంతంగా ఉన్నాము, కానీ లోపల కొంత ఆందోళన ఉంది. మేము బాగా ఆడతామని మాకు తెలుసు. ఒత్తిడిలో వింతైన విషయాలు జరుగుతాయని అన్నాడు.