ఆ జట్టే టీ20 ప్రపంచకప్ గెలుస్తుంది : గవాస్కర్
Sunil Gavaskar picks favourites to win T20 WC 2021 final.టీ20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 14 Nov 2021 3:46 PM ISTటీ20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో అమీతుమి తేల్చుకోనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి పొట్టి కప్పును ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే విజయం సాధించి.. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడుతుందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడుతున్నాడు.
ఐసీసీ మెగా ఈవెంట్లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉందని.. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు టైటిల్ ఫేవరెట్ అని గవాస్కర్ అన్నారు. ఐసీసీ ఈవెంట్ నాకౌట్ దశలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. వాళ్లకు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. 'ఆ జట్టు కీలక మ్యాచ్‌ల్లో ఓడిన సందర్బాలు కంటే గెలిచిన సందర్బాలే ఎక్కువ. వాళ్లు తమదైన రోజున ప్రత్యర్ధి జట్టును చిత్తుగా ఓడించగలరు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలి సారి టీ20 ప్రపంచకప్ ట్రోఫిని ఆస్ట్రేలియన్లు కైవసం చేసుకుంటారు' అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.
ఇక ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మొత్తం 18సార్లు తలపడగా.. 12 సార్లు ఆసీస్‌నే విజయం వరించింది. అలాగే మొత్తం 31 నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 20 విజయాలు సాధించింది. అన్ని జట్లపైనా ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను ఐదుసార్లు గెలువగా.. రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫిని నెగ్గింది. అయితే.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 టోర్నీని దక్కించుకోకపోవడం లోటు. ఈ సారి ఆ లోటు భర్తీ చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.