అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బ్రాడ్
Stuart Broad Announces Retirement From Cricket After Ashes Series. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఐదో టెస్టు అతని కెరీర్‌లో చివరి మ్యాచ్. యాషెస్ ఐదో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు (జూలై 29) ముగిసిన తర్వాత.. బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల బ్రాడ్ 2006లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. అతని కెరీర్ దాదాపు 17 సంవత్సరాలు కొనసాగింది.
167వ టెస్టు ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్ ఇప్పటి వరకు 602 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లోనే బ్రాడ్ 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు బౌలర్లు మాత్రమే బ్రాడ్ కంటే ఎక్కువ వికెట్లు సాధించారు. మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, అనిల్ కుంబ్లే.. బ్రాడ్ కంటే ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో ముందున్నారు. బ్రాడ్ కు ఇంకా ఒక ఇన్నింగ్స్ మిగిలి ఉంది. దీంతో బ్రాడ్ వికెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా ఇంగ్లండ్ తరపున ఆడాడు. క్రిస్ బ్రాడ్ ICC మ్యాచ్ రిఫరీ.
స్టువర్ట్ బ్రాడ్ ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. 2016లో చివరి వన్డే, 2014లో చివరి టీ20 ఆడాడు. 2010లో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్ సభ్యుడు. 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో బ్రాడ్ ఒక సెంచరీ, 13 అర్ధ సెంచరీల సహాయంతో టెస్టుల్లో 3,656 పరుగులు చేశాడు. 438 ఫోర్లు, 54 సిక్సర్లు ఉన్నాయి. వన్డేలు, టీ20ల్లో బ్యాట్‌తో తనదైన ముద్ర వేయలేకపోయాడు బ్రాడ్. 2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ బ్రాడ్ బౌలింగ్‌లో ఓ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక్కసారిగా బ్రాడ్ పేరు వెలుగులోకి వచ్చింది.