నిషేదం ప‌డినా మార‌ని స్మిత్‌.. చీటింగ్ చేస్తూ మ‌ళ్లీ దొరికాడు

Steve Smith removes Rishabh Pants guard mark.గెల‌వ‌డం ముఖ్యం. ఎలాగెలిచాం అన్న‌ది ముఖ్యం కాదు. ఇది ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు, చీటింగ్ చేస్తూ మ‌ళ్లీ దొరికాడు స్మిత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2021 9:51 AM GMT
smith

గెల‌వ‌డం ముఖ్యం. ఎలాగెలిచాం అన్న‌ది ముఖ్యం కాదు. ఇది ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు అనుస‌రించే విధానం. మైదానంలో ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌ను స్లెడ్జింగ్ చేస్తూ వారిని మాన‌సికంగా దెబ్బ తీసి విజ‌యం సాధించ‌డం గ‌తంలో చూశాం. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మారాక భార‌త జ‌ట్టు వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్థి ఒక మాట అంటే మ‌నోళ్లు రెండు అనేస్తున్నారు. అంతేనా.. ఆట‌తోనూ అద‌ర‌గొడుతున్నారు. దీంతో స్లెడ్జింగ్ జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని ఆసీస్ భావించింది. దీంతో.. తాజా సిరీస్‌లో భార‌త ఆట‌గాళ్ల‌ను రెచ్చ‌గొట్టే ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోర ఓట‌మి త‌రువాత భార‌త జ‌ట్టు పుంజుకున్న తీరు అద్భుతం. మూడో టెస్టులోనూ అద‌ర‌గొట్టారు. గెలవ‌క పోయినా.. మ్యాచ్‌ను కాపాడుకున్నారు. చివ‌రి రోజు రిష‌బ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో టీమ్ఇండియా విజ‌యం సాధించేలా క‌నిపించింది. దీంతో మ‌రో ఓట‌మి త‌ప్ప‌ద‌ని బావించిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మ‌రోసారి త‌ప్పుచేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. తాజా ఘటనతో చీటింగ్‌లో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు స్మిత్‌.


ఏ బ్యాట్స్‌మెన్ అయినా.. బ్యాటింగ్‌ చేయడానికి క్రీజ్‌లోకి వెళ్లగానే ముందుగా తీసుకునేది గార్డ్‌. అది లెగ్‌ స్టిక్‌, మిడిల్‌ స్టిక్‌ అనేది బ్యాట్స్‌మన్‌ నిర్ణయించుకుని అంపైర్‌ను గార్డ్‌ కోరతాడు. మూడో టెస్టులో రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో గార్డ్‌ మార్క్‌లను స్టీవ్ స్మిత్ ప‌లుమార్లు మార్చేశాడు. డ్రింక్స్ బ్రేక్‌లో పంత్ గార్డ్‌ను కావాల‌ని చెరిపేస్తూ.. స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. త‌న గార్డ్ చెరిపేయ‌డంతో పంత్ మ‌రోసారి మార్క్ చేసుకోవాల్సి వ‌చ్చింది. పంత్ గార్డు మార్చి.. భార‌త విజ‌యాన్ని అడ్డుకోవాల‌ని స్మిత్ ఇలా చేశాడు. ఇందులో అత‌డి ఫేస్ క‌న‌ప‌డ‌పోయినా.. అత‌ను వేసుకున్న జెర్సీ నెంబ‌ర్ 49 స్ప‌ష్టంగా క‌నిపించింది.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై క్రికెట్ అభిమానులు ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. 'భారత్ మ్యాచ్ గెలుస్తుందనే స్మిత్ ఇలా చేశాడు' అని ఒక‌రుకామెంట్ చేయ‌గా.. 'ఏడాది బ్యాన్‌ పడ్డ క్రికెటర్‌.. మళ్లీ చీటింగ్‌ చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు', 'ఏడాది నిషేధానికి గురైనా స్మిత్ ఏమాత్రం మారలేదుగా', 'చీటర్స్‌ ఎప్పుడూ చీటర్సే' అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.




Next Story