కెప్టెన్ కూల్.. కోప్పడ్డాడు..!

Captain Cool Dhoni Yelled. ఐపీఎల్‌-14లో భాగంగా శ‌నివారం జ‌రిగిన రెండో మ్యాచ్‌లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా కోపం వచ్చేసింది. ఓపెనర్ పృథ్వీ షాఇచ్చిన క్యాచ్‌ని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్ వదిలేశాడు.

By Medi Samrat  Published on  11 April 2021 6:14 AM GMT
IPL News

ఐపీఎల్‌-14లో భాగంగా శ‌నివారం జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు చెన్నైపై సునాయ‌స విజ‌యం సాధించింది. గురు శిష్యుల సమరంగా పేర్కొన్న చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లో.. ధోనీపై‌ పంత్‌దే పైచేయి అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. 189 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో క్రీజులోకి వ‌చ్చిన‌ ఢిల్లీ ఓపెన‌ర్లు.. సీఎస్‌కే‌ పేలవమైన బౌలింగ్‌ను చెండాడారు. శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85), పృథ్వీ షా (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) ఢిల్లీ క్యాపిటల్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్ లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా కోపం వచ్చేసింది. ఓపెనర్ పృథ్వీ షాఇచ్చిన క్యాచ్‌ని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్ వదిలేశాడు. అతని ఫీల్డింగ్ చూసిన ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్యాచ్ వదిలే సమయానికి 20 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు పృథ్వీ షా. అతని క్యాచ్ వదిలేయడంతో ధోనీ కాస్త సహనం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా పృథ్వీ షా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి ఎక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది. లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్.. ఆ బంతిని క్యాచ్‌గా అందుకోవడంలో విఫలమయ్యాడు. 10వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన మొయిన్ అలీ బౌలింగ్‌లో మరోసారి పృథ్వీ షా క్యాచ్ ఇచ్చాడు. ఈ సారి రుతురాజ్ గైక్వాడ్ ఆ క్యాచ్‌ని చేజార్చాడు. దీంతో ధోని ముఖంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది.

మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ తమ బౌలింగ్ మెరుగుపడాలని చెప్పుకొచ్చాడు. పిచ్‌పై డ్యూ (మంచు) కనబడిందని..ఇది మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుందని అనుకున్నామని.. మంచు పిచ్‌పై ఉంటే అది ఛేజింగ్‌ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవమని తెలిపాడు ధోని. టాస్‌ ఓడిపోయినప్పటికీ ఈ పిచ్‌పై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే అనుకున్నామని.. అలాగే తొలి అరగంట చాలా జాగ్రత్తగా ఆడాలనుకున్నా అది వీలుపడలేదని ధోని చెప్పుకొచ్చాడు. ఆరంభంలో కీలక వికెట్లను చేజార్చుకున్నాం. అయినా మా బ్యాటర్స్‌ బాగా ఆడారు. మా బౌలింగ్‌ ఇంకా మెరుగుపడాలి.. బౌలర్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉందని కాస్త అసహనం వ్యక్తం చేశాడు ధోని. వారు ప్రత్యర్థికి బౌండరీలు ఇవ్వడమే లక్ష్యంగా బంతులు వేసినట్లు కనబడిందని.. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్‌ ఒక గుణపాఠమన్నాడు. ఈ తరహా పిచ్‌పై 200 పరుగులు ఉంటేనే గెలుస్తాం.. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేశారని తెలిపాడు ధోని.


Next Story