68 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు.. హైదరాబాద్ పాంచ్ పటాకా
SRH race to nine wicket win after RCB collapse.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో సన్‌రైజర్స్
By తోట వంశీ కుమార్ Published on 24 April 2022 9:06 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన హైదరాబాద్ ఆ తరువాత వరుసగా విజయాలను సాధిస్తూ దూసుకువెలుతోంది. బౌలర్లు విజృంభించి బెంగళూరు జట్టును 68 పరుగులకే కుప్పకూల్చగా.. స్వల్ప లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేదించి.. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానానికి ఎగబాకింది.
టాస్ గెలిచిన విలియమ్ సన్ బౌలింగ్ ఎంచుకోగా.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు జట్టు అసాధారణ రీతిలో కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్ల దాటికి బెంగళూరు బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. చివరికి 16.1 ఓవర్లలో 68 పరుగులకే బెంగళూరు ఆలౌటైంది. సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల పరుగులు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో బెంగళూరు ఈ లీగ్‌లో తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. సుచిత్ రెండు, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ ఒక్కొ వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి హైదరాబాద్ చేదించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47; 28 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టగా.. కెప్టెన్ విలియమ్సన్ (16 నాటౌట్; 17 బంతుల్లో 2 పోర్లు) అండగా నిలిచాడు. జాన్సెన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.