విజృంభించిన శ్రీశాంత్.. 5 వికెట్లు తీశాడుగా..!

Sreesanth picks up the first five-wicket haul after 15 years. శ్రీశాంత్ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. 15 ఏళ్ల త‌ర్వాత ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

By Medi Samrat  Published on  22 Feb 2021 12:35 PM GMT
Sreesanth picks up first five-wicket haul after 15 years

ఈ ఏడాది ఐపీఎల్ వేలంపాటలో తనని ఎవరైనా సెలెక్ట్ చేస్తారేమోనని స్పాట్ ఫిక్సింగ్ వివాదం నుండి బయటపడ్డ కేరళ ఆటగాడు శ్రీశాంత్ భావించాడు. కానీ ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు. అతడి వయసు అయిపోయింది అనుకున్నారో.. లేక ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందని అనుకున్నారో కానీ శ్రీశాంత్ ను వద్దనుకున్నారు. ఐపీఎల్‌ 2021లో ఆడాల‌ని శ్రీశాంత్ ఆశ‌ప‌డినా.. అత‌నిపై ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో క‌నీసం వేలానికి కూడా అర్హ‌త సాధించ‌లేక‌పోయాడు.

కానీ శ్రీశాంత్ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. 15 ఏళ్ల త‌ర్వాత ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భాగంగా సోమవారం బెంగళూరులోని కెఎస్‌సిఎ స్టేడియంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ మ‌ధ్య మ్యాచ్‌లో శ్రీశాంత్ ఈ ఘ‌నత సాధించాడు. 9.3 ఓవ‌ర్లు వేసిన అత‌డు 65 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. చివ‌రిసారి 2006లో ఓ లిస్ట్ ఎ ఫార్మాట్ మ్యాచ్‌లో శ్రీశాంత్ ఐదు వికెట్లు తీశాడు. అభిషేక్ గోస్వామి (54; 63 బంతుల్లో 4x4, 2x6), అక్షదీప్ నాథ్ (68; 60 బంతుల్లో 9x4), భువనేశ్వర్ కుమార్ (1), మొహ్సిన్ ఖాన్ (6), శివం శర్మ (7)ల వికెట్లను ఎస్ శ్రీశాంత్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీశాంత్ 87 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 113 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6/55 ఉత్తమ గణాంకాలు. శ్రీశాంత్ చెలరేగడంతో యూపీ 283 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. 2019లో సుప్రీంకోర్టు అతడి నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో ఏడేళ్లకు కుదించింది. గతేడాది సెప్టెంబర్‌తో ఈ నిషేధం పూర్తయింది. అనంతరం దేశవాళి క్రికెట్‌లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు.




Next Story