ప్రీవరల్డ్ కప్ ఈవెంట్‌లో నిద్ర పోలేదని సౌతాఫ్రికా కెప్టెన్ వివరణ
ప్రీవరల్డ్ కప్ ఈవెంట్‌లో నిద్ర పోలేదని సౌతాఫ్రికా కెప్టెన్ వివరణ ఇచ్చాడు.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 6:33 AM GMTప్రీవరల్డ్ కప్ ఈవెంట్‌లో నిద్ర పోలేదని సౌతాఫ్రికా కెప్టెన్ వివరణ
వన్డే వరల్డ్ కప్ మెగా సమరం నేటి నుంచే ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో విజేతగా నిలవాలని టీమ్‌లు భావిస్తున్నాయి. చాలా కాలం తర్వాత భారత్ గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో విజేతగా నిలవాలని టీమిండియా గట్టిపట్టుదలతో ఉంది. అయితే.. అందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. కాస్త చూసుకుని ఆడితే ప్రత్యర్థులకు చెమటలు పట్టించేయొచ్చు. అయితే.. వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు బుధవారం ప్రీవరల్డ్ కప్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పది జట్ల కెప్టెన్లు హాజరు అయ్యారు.
ఈవెంట్‌లో అందరు కెప్టెన్‌లు వరుసగా కూర్చొని ఉన్నారు. అయితే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాత్రం సమావేశం జరుగుతుండగా చక్కగా నిద్రలోకి జారుకున్నట్లు కనిపించాడు. కుర్చీలో కూర్చొని తల కిందకు పెట్టి నిద్రపోతున్నట్లుగా కనిపించాడు. అతడు నిద్రపోతున్నట్లు కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. దాంతో.. ఆ ఫొటో వైరల్ కావడంపై స్వయంగా దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బవుమా స్పందించాడు.తాను ప్రీ వరల్డ్ కప్ ఈవెంట్‌లో నిద్ర పోలేదని చెప్పాడు. కెమెరా యాంగిల్ సరిగ్గా లేదు. అందుకే తాను నిద్రపోతున్నట్లు మాత్రమే కనిపించిందని చెప్పాడు. కానీ.. నిజానికి తాను నిద్రపోలేదని దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా క్లారిటీ ఇచ్చాడు.
వరల్డ్ కప్ టోర్నీ భారత్ వేదికగా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులంతా నేరుగా టీమిండియా ఆటను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా.. భారత్ సహా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.