టీమ్ఇండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో నిన్న రాత్రి ఆయన ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గంగూలీ మొక్క వైరస్ లోడ్ 19.5గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా.. గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పుడు గంగూలీ సోదరుడు, తల్లి ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో దాదా గుండెపోటుకు గురైయ్యాడు. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెలో నొప్పిగా అనిపించడంతో వుడ్ ల్యాండ్ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్థారించి యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు. డే అండ్ నైట్ టెస్టుకు పచ్చ జెండా ఊపారు. అంతేకాకుండా టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఒప్పించడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. భారత క్రికెట్ కు కొత్త ఒరవడిని తీసుకువచ్చారు.