బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీలో నొప్పి అని చెప్పడంతో.. ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఆయన్ను కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై.. కోలుకున్న గంగూలీ మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
గంగూలీ.. ఛాతీలో నొప్పితో బాధపడడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఆయన వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కోల్‌కత్తా వుడ్ లాండ్స్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ఆయనకు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్ లాండ్స్ వైద్యులు తెలిపారు. రెండు రోజుల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సర్జరీ అనంతరం గంగూలీ కోలుకోవడంతో అభిమానులు ఆనందించగా.. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన నెలకొంది.