భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ఆఫ్ కోల్‌కతా అధ్యక్షుడు ఉత్తమ్ సాహాపై రూ.50 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశారు. డిసెంబర్ 13, శనివారం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా స్టేడియం సంఘటనతో గంగూలీపై సాహా చేసిన బహిరంగ ఆరోపణలకు ప్రతిస్పందనగా గంగూలీ యాక్షన్ లోకి దిగారు.
లాల్‌బజార్‌లో దాఖలు చేసిన గంగూలీ ఫిర్యాదులో, సాహా ప్రకటనలు దాదా ప్రతిష్టకు గణనీయమైన హాని కలిగించాయని, ఎటువంటి వాస్తవ ఆధారం లేకుండా ఆరోపణలు ఉన్నాయని అన్నారు. సాహా వ్యాఖ్యలను తప్పుడు, దురుద్దేశంతో కూడిన, అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలుగా ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న గంగూలీ, స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి తాను అతిథిగా మాత్రమే హాజరయ్యానని, మెస్సీ కార్యక్రమంతో తనకు ఎటువంటి అధికారిక సంబంధం లేదని స్పష్టం చేశారు.