ఆస్పత్రి నుంచి దాదా డిశ్చార్..
Sourav Ganguly discharged from Woodlands Hostpital.బీసీసీఐ అధ్యక్షడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2021 4:26 PM ISTబీసీసీఐ అధ్యక్షడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఇంట్లో ఉండగా.. గుండెపోటు రావడంతో వెంటనే కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. బుధవారం దాదా కోలుకోవడంతో.. గురువారం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెలుతూ.. ఆస్పత్రి ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడారు.
తన ఆరోగ్యం బాగుందని చెప్పారు. తనకు వైద్యం అందించిన వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయపడ్డారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు. గంగూలీ డిశ్ఛార్జ్ కావడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వాస్తవానికి గంగూలీ బుధవారమే ఇంటికి చేరుకోవాల్సి ఉన్నా మరో రోజు ఆస్పత్రిలో ఉండాలని నిర్ణయించుకోవడంతో నేడు డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి ఎండీ రూపాలి బసు తెలిపారు.
మరో రెండు, మూడు వారాలు గడిస్తే.. పూర్తిగా కోలుకుంటారని అప్పటి వరకు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని రూపాలి చెప్పారు. గంగూలీ కోలుకోవాలంటూ అంతకుముందు రాజకీయ నేతలు, టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులు ట్విట్లు చేసిన సంగతి తెలిసిందే. సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు.