ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది.
By - అంజి |
ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది. 2025 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆమె గెలుచుకున్నారు. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును రెండోసారి WPL ఛాంపియన్‌గా నిలబెట్టినందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది. 2025 ఐసీసీ మహిళా ప్రపంచ కప్‌లో భారత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్మృతి, టోర్నీలో 434 పరుగులు సాధించి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో ప్రధాన భూమిక పోషించారు.
కెప్టెన్‌గా ఆర్‌సీబీ జట్టుకు వరుసగా రెండోసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని అందించి తన నాయకత్వ పటిమను చాటారు. కేవలం 16 ఏళ్లకే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన స్మృతి, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 సెంచరీలు సాధించి ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ సరసన నిలిచారు. "ఈ అవార్డు ఇచ్చినందుకు బీబీసీకి ధన్యవాదాలు. 2025 మహిళా క్రికెట్‌కు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ముఖ్యంగా వరల్డ్ కప్ గెలవడంలో నా వంతు సహకారం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని స్మృతి పేర్కొన్నారు.
మరికొంత మంది విజేతలు:
లెజెండరీ ఆటగాళ్లు లియాండర్ పేస్, దీపా మాలిక్, అంజు బాబీ జార్జ్‌లతో కూడిన జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేసింది.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ (20 ఏళ్ల వయసులో వరల్డ్ కప్ గెలిచినందుకు).
పారా-స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్: ప్రీతి పాల్ (పారిస్ పారాలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు).
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: షూటింగ్ దిగ్గజం అంజలి భాగవత్.