స్మృతి మంధాన స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌

Smrithi Mandhan stunning catch goes viral.జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్, మ‌హ్మద్ కైఫ్ ఇలా చెప్పుకుంటే పొతే పురుషుల‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 11:25 AM GMT
స్మృతి మంధాన స్టన్నింగ్‌ క్యాచ్‌..  వీడియో వైర‌ల్‌

జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్, మ‌హ్మద్ కైఫ్ ఇలా చెప్పుకుంటే పొతే పురుషుల‌ క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డ‌ర్లు ఎంద‌రో ఉన్నారు. మహిళల క్రికెట్‌లో మాత్రం వేళ్లమీద ఉంటుంది ఆ జాబితా. ఇప్పుడిప్పుడే ఉమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో మెరుస్తున్నారు. తాజాగా భార‌త ఉమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన త‌న ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఇంగ్లాండ్ తో జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో బౌండ‌రీ ద‌గ్గ‌ర ఆమె డైవ్ చేస్తూ ప‌ట్టిన అద్భుత‌మైన క్యాచ్‌కు ఎంతో మంది ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

దీప్తి బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్ఉమెన్స్ స్కివ‌ర్‌.. లాంగ్‌ షాట్‌ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన పరుగెత్తుకుంటూ వచ్చి.. డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకుంది. 49 ప‌రుగులు చేసిన స్కివర్‌.. ప‌రుగు తేడాతో అర్థ‌శ‌త‌కం చేజార్చుకుని నిరాశగా పెవిలియన్ చేరింది. స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టిన మంధానపై సహచర ప్లేయర్స్ అభినందనలు కురిపించారు. మంధాన పట్టిన క్యాచ్ చూసిన మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు ట్విట‌ర్ యూజ‌ర్లు ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 'ఫ్లై స్మృతి ఫ్లై గ‌ర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్‌' అంటూ ఆస్ట్రేలియా మాజీ వుమెన్స్ క్రికెట‌ర్ లీసా స్తాలేక‌ర్ ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్‌లో మంధాన బ్యాటింగ్‌లోనూ రాణించింది. 57 బంతుల్లో 49 ప‌రుగులు చేసి భారత జట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది.

సిరీస్‌లో చివ‌రిదైన మూడో వ‌న్డేకు వ‌ర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్‌ స్కివర్‌ (49; 5 ఫోర్లు), కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ స్మృతి మంధాన (49; 8 ఫోర్లు) రాణించింది. మిథాలీ రాజ్ అజేయ అర్ధ సెంచరీ 86 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు) సాధించడంతో పాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను మ‌రుపురాని విజ‌యాన్నిఅందించింది.మూడు వ‌న్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో ద‌క్కించుకుంది.

Next Story