మహేంద్రుడు మళ్లీ బ్యాట్ పట్టి సిక్సుల వర్షం కురిపించాడు. అరే ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు గదా..? ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కూడా వచ్చే నెల ప్రారంభం అవుతుంది గదా..? ధోని ఇప్పుడు ఏం మ్యాచ్‌లు ఆడుతున్నాడని అనుకుంటున్నారా..? అసలు మ్యాటరేంటంటే..? ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించింది. ఐపీఎల్ 13వ సీజన్‌లో ధోని దారుణంగా విఫలం అయిన సంగతి తెలిసిందే. దీంతో 14వ సీజన్‌లో బ్యాట్ ఝళిపించాలని ధోని పట్టుదలతో ఉన్నాడు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితమే చెన్నై చేరుకున్న ధోని తాజాగా ప్రాక్టీస్ మొదలెట్టాడు.
ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్ సమయంలో వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దాదాపు గంట సేపు ప్రాక్టీస్ కొనసాగించిన ధోని ప్రాక్టీస్ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ వీడియోను చెన్నై జట్టు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. చాన్నాళ్ల తరువాత ధోనిని మళ్లీ మైదానంలో ఇలా చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ప్రపంచకప్ అనంతరం ధోని టీమ్ఇండియాకు దూరం అయ్యాడు. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఆ తరువాత ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాడు. ఆ సీజన్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ధోని కూడా పెద్దగా రాణించింది లేదు. దీంతో సీఎస్‌కే తొలిసారి ఫ్లే ఆప్స్‌కు చేరకుండానే నిష్కమ్రించింది. మరి ఈ సీజన్‌లో ధోని జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.