ర్యాంక్‌లను పట్టించుకోను.. నా లక్ష్యం ఒక్కటే: మహ్మద్ సిరాజ్
వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు సిరాజ్.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 7:30 PM ISTర్యాంక్‌లను పట్టించుకోను.. నా లక్ష్యం ఒక్కటే: మహ్మద్ సిరాజ్
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా దూసుకెళ్తోంది. ఒక్క ఓటమి లేకుండానే సెమీ ఫైనల్ చేరిన ఏకైక టీమ్ గా నిలిచింది. భారత జట్టులో ఒక్కరని కాదు.. ప్రతి ప్లేయర్ ఫామ్‌లో ఉన్నాడనే చెప్పాలి. బ్యాటర్లు జూలు జులిపిస్తుంటే.. మరో వైపు బౌలర్లు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ర్యాంకుల గురించి తాను పట్టించుకోను అని.. జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నాడు. అందుకు అనుగుణంగానే ఆడుతున్నానని మహ్మద్ సిరాజ్ స్పష్టం చేశాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు సిరాజ్. గతంలో రెండుసార్లు ‘టాప్’నకు చేరి ఆ తర్వాత తన స్థానాన్ని కోల్పోయిన సిరాజ్ ఈ ప్రపంచకప్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో మళ్లీ నంబర్ వన్‌గా అవతరించాడు. మొత్తంగా 709 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిదిని వెనక్కి నెట్టి.. అగ్రపీఠానికి చేరుకున్నాడు. ఈక్రమంలోనే మాట్లాడిన సిరాజ్ తన ప్రధాన లక్ష్యం గురించి చెప్పాడు.
నిజానికి గతంలో కూడా తాను నెంబర్ 1గా ఉండేవాడిని అన్నాడు సిరాజ్. ఆ తర్వాత ర్యాంకింగ్స్ విషయంలో ఎత్తుపళ్లాలు ఉంటాయని.. కాబట్టి నంబర్లను ఏమాత్రం పట్టించుకోను అన్నాడు. తన ఏకైక లక్ష్యం టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో తన వంతు సహకారం అందించడమే అని స్పష్టం చేశారు. తన బౌలింగ్‌తో టీమిండియా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే అంతకుమించిన ఆనందం మరొకటి లేదన్నాడు సిరాజ్. అతని కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కాగా.. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో సిరాజ్ ఉండగా.. కుల్దీప్ యాదవ్ (4వ స్థానం), జస్‌ప్రీత్ బుమ్రా (8వ స్థానం), మహ్మద్ షమీ (10వ స్థానం) టాప్-10లో కొనసాగుతున్నారు.
ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్-2023లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి అన్నింట్లో గెలిచింది.. పాయింట్స్ టేబుల్‌లో తొలి స్థానంలో కొనసాగుతోంది. తాజా ఎడిషన్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్ సేన లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. బెంగళూరు వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగనుంది.