స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్‌.. వేలంలో స‌రైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌లేద‌ని.. సైమ‌న్ క‌టిచ్ రాజీనామా

Simon Katich resigns as SRH assistant coach.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి చివ‌రి వారంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 3:41 PM IST
స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్‌.. వేలంలో స‌రైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌లేద‌ని.. సైమ‌న్ క‌టిచ్ రాజీనామా

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి చివ‌రి వారంలో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి జ‌రిగే ఐపీఎల్ సీజ‌న్‌లో మ‌రో రెండు కొత్త ప్రాంచైజీలు పాల్గొన‌నుండ‌డంతో ఇటీవ‌ల భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ) మెగా వేలాన్ని నిర్వ‌హించింది. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నాయి. ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కూడా నికోల‌స్ పూర‌న్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రొమారియో షెప‌ర్ట్‌, రాహుల్ త్రిపాఠి వంటి ఆట‌గాళ్ల‌ను భారీ మొత్తాన్ని వెచ్చించి వేలంలో ద‌క్కించుకుంది.

అయితే.. మెగా వేలంలో స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్య మార‌న్‌ స‌రైన జ‌ట్టును కొనుగోలు చేయ‌లేదని ఆ జ‌ట్టు అసిస్టెంట్ కోచ్ సైమ‌న్ క‌టిచ్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడు. వేలం కోసం ముందుగా వేసిన ప్ర‌ణాళిక‌ల‌న్నీ కూడా వేలంలో విస్మరించ‌బ‌డ్డాయ‌ని ఆరోపిస్తూ రాజీనామా చేశాడు. దీంతో స‌న్ రైజ‌ర్స్ ప్ర‌స్తుతం కొత్త అసిస్టెంట్ కోచ్‌ను వెతికే ప‌నిలో ఉంది. కాగా.. దీనిపై స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఐపీఎల్‌-2021 సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ దారుణ ప్రదర్శన చేసింది. ఆ సీజ‌న్‌లో 2016లో జట్టుకు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు క‌నీసం తుది జ‌ట్టులో చోటు క‌ల్పించ‌లేదు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్‌, రషీద్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్‌-2022 సీజన్‌ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది. టామ్‌ మూడీ తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించింది. ఇక వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా, డేల్‌ స్టెయిన్‌, ముత్తయ్య మురళీధరన్‌, హేమంగ్‌ బదానీని తమ సిబ్బందిలో చేర్చుకుని మెగా వేలానికి వెళ్లింది.

అయితే.. మెగా వేలంలో స‌న్‌రైజ‌ర్స్ మెనేజ్‌మెంట్ స‌రైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌లేద‌ని క్రికెట్ విశ్లేష‌కుల‌తో పాటు అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ ఆట‌గాళ్ల‌ను వ‌దిలివేసి అనామ‌క ఆట‌గాళ్ల‌ను కోట్ల రూపాయ‌లు వెచ్చించి కొనుగోలు చేశార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కార‌ణంతోనే అసిస్టెంట్ కోచ్ సైమ‌న్ క‌టిచ్ త‌ప్పుకోవ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశమైంది.

మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే..

వెస్టిండీస్ ఆట‌గాడు నికోలస్‌ పూరన్‌(10.75 కోట్లు), వాషింగ్టన్‌ సుందర్‌(8.75 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి(8.5 కోట్లు), రొమారియో షెపర్డ్‌(7.7 కోట్లు), అభిషేక్‌ శర్మ(6.5 కోట్లు), భువనేశ్వర్‌ కుమార్‌(4.2 కోట్లు), మార్కో జన్సెన్‌(4.2 కోట్లు), టి నటరాజన్‌(4 కోట్లు), కార్తీక్‌ త్యాగి(4 కోట్లు), ఎయిడెన్‌ మార్క్రమ్‌(2.6 కోట్లు), సీన్‌ అబాట్‌(2.4 కోట్లు), గ్లెన్‌ ఫిలిప్‌(1.5 కోట్లు), శ్రేయస్‌ గోపాల్‌(75 లక్షలు), విష్ణు వినోద్‌(50 లక్షలు), ఫజల్‌ హక్‌ ఫారుఖి(50 లక్షలు), జె సుచిత్‌(20 లక్షలు), ప్రియమ్‌ గార్గ్‌(20 లక్షలు), ఆర్‌ సమర్థ్‌(20 లక్షలు), శశాంక్‌ సింగ్‌(20 లక్షలు), సౌరభ్‌ దూబే(20 లక్షలు)

Next Story