పంజాబ్ తరుపున బరిలో దిగనున్న గిల్, అభిషేక్ శర్మ..!
త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును పంజాబ్ సోమవారం ప్రకటించింది.
By - Medi Samrat |
త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును పంజాబ్ సోమవారం ప్రకటించింది. పంజాబ్ జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు ఉన్నారు. పంజాబ్ తన తొలి మ్యాచ్‌ని డిసెంబర్ 24న జైపూర్‌లో మహారాష్ట్రతో ఆడనుంది.
విజయ్ హజారే ట్రోఫీలో తన సత్తాను నిరూపించుకోవాలని భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తహతహలాడుతున్నాడు. గిల్ ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌తోపాటు T20 ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన జట్లలో స్థానం సంపాదించుకోలేదు. పేలవమైన ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా గిల్ జట్టులో చోటు కోల్పోయాడు.
పంజాబ్ జట్టు పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తోంది. జట్టులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, సన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ వంటి పెద్ద హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ మరియు ఆల్ రౌండర్లు ఉన్నారు. వీరితో పాటు గుర్నూర్ బ్రార్, క్రిష్ భగత్ ఫాస్ట్ బౌలింగ్ పగ్గాలు చేపట్టనున్నారు.
ఇదిలావుంటే.. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారో స్పష్టంగా తెలియదు. ఎందుకంటే జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్న భారత జట్టు.. ఆ తర్వాత జనవరి 21 నుంచి ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
గత సీజన్‌లో పంజాబ్ ప్రయాణం క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ఈసారి తన ఏడు లీగ్ మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనుంది. గత సీజన్‌లో పంజాబ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ఈసారి కూడా అతనిపైనే కన్ను పడనుంది.
పంజాబ్ గ్రూప్‌లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబై ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ లీగ్ దశ జనవరి 8న ముగియనుంది. కాగా, పంజాబ్ తన కెప్టెన్ పేరును ప్రకటించలేదు. కాబట్టి మ్యాచ్‌ని బట్టి కెప్టెన్సీలో మార్పులు కనిపించవచ్చు.
18 మంది సభ్యులతో కూడిన పంజాబ్ జట్టు
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్నూర్ పన్ను, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉదయ్ సహారన్, నమన్ ధీర్, సలీల్ అరోరా, సన్వీర్ సింగ్, రమణదీప్ సింగ్, జష్న్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖదీప్ బజ్వా.