వేలానికి ముందు రోజు భారీ టీ20 సెంచ‌రీ బాదిన శ్రేయాస్ అయ్యర్.. రికార్డుల‌న్నీ బ్రేక్‌..!

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో శనివారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు

By Medi Samrat  Published on  23 Nov 2024 2:45 PM GMT
వేలానికి ముందు రోజు భారీ టీ20 సెంచ‌రీ బాదిన శ్రేయాస్ అయ్యర్.. రికార్డుల‌న్నీ బ్రేక్‌..!

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో శనివారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ముంబై తరఫున ఆడుతున్న అయ్యర్ కేవలం 57 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయంగా 130 పరుగులు చేశాడు. అయ్యర్ ధాటికి ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది.

శ్రేయాస్ అయ్యర్‌కు షామ్స్ ములానీ (41), పృథ్వీ షా (33) నుంచి మంచి సహకారం లభించింది. 29 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో ఒడిశాపై డబుల్ సెంచరీ (233), మహారాష్ట్రపై సెంచరీ (142) సాధించాడు.

అయ్యర్ చివరి ఐదు ఇన్నింగ్స్‌లు

130* (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ)

42 (రంజీ ట్రోఫీ)

233 (రంజీ ట్రోఫీ)

142 (రంజీ ట్రోఫీ)

30 (రంజీ ట్రోఫీ)

గోవాపై ముంబై తరఫున శ్రేయాస్ అయ్యర్ మూడో టీ20 సెంచరీ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ముంబై తరఫున మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఇన్ని సెంచరీలు సాధించలేదు. రోహిత్ శర్మ, షోయబ్ షేక్, పృథ్వీ షా ఒక్కో సెంచరీ చేశారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ మూడో సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఉన్ముక్త్ చంద్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా తలో మూడు సెంచరీలు చేశారు.

టీ20 ఫార్మాట్‌లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.

ముంబై తరఫున అత్యధిక టీ20 పరుగులు

1713 - ఆదిత్య తారే

1491 - శ్రేయాస్ అయ్యర్

1420 - సూర్యకుమార్ యాదవ్

982 - అజింక్య రహానే

892 - శివమ్ దూబే

టీ20 ఫార్మాట్‌లో ముంబై తరఫున శ్రేయాస్ అయ్యర్ మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ముంబై త‌రుపున అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా అతని పేరు మీద నమోదైంది.

147 - శ్రేయాస్ అయ్యర్ vs సిక్కిం, 2019

134 - పృథ్వీ షా vs అస్సాం, 2022

130* - శ్రేయాస్ అయ్యర్ vs గోవా, నేడు

110 - షోయబ్ షేక్ vs గుజరాత్, 2015

Next Story