టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఈ టీమ్‌తో టైటిల్ ప‌క్కా..!

అక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత జట్టును ప్రకటించారు

By Medi Samrat  Published on  27 Aug 2024 9:59 AM GMT
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఈ టీమ్‌తో టైటిల్ ప‌క్కా..!

అక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ మంగళవారం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు జట్టు కెప్టెన్‌, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా జ‌ట్టును ప్ర‌క‌టించారు. యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్‌లు ప్రపంచకప్ జట్టుకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరి ఎంపిక ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ట్రావెలింగ్ రిజర్వ్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు.

ఎంపికైన‌ జట్టులో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తోంది. భారత్‌కు ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఉన్నారు. బ్యాకప్‌గా డైలాన్ హేమలత ఉంది. మిడిలార్డర్‌లో జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఉన్నారు. వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు ఫినిషర్‌గా మంచి పేరుంది. యాస్టిక భాటియాను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. అయితే ఆమె ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. ఈ కారణంగానే వికెట్ కీపర్ ఉమా ఛెత్రికి కూడా ట్రావెలింగ్ రిజర్వ్‌లో చోటు దక్కింది. భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్ పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్‌ల‌పై ఆధారపడి ఉంది. వీరిద్దరూ కాకుండా అందరి చూపు అరుంధతి రెడ్డిపై ఉంటుంది. స్పిన్ బాధ్యత దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆశా శోభన ల‌కు అప్ప‌గించారు.

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలతో పాటు భారత్‌ గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది. అక్టోబర్ 4న దుబాయ్ వేదికగా టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. భారత జట్టు 9న శ్రీలంకతో తలపడనుంది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

టీ20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికె), యాస్తికా భాటియా (వికె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, డైలాన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన సజీవన్.

ట్రావెలింగ్ రిజర్వ్ : ఉమా ఛెత్రి (వాక్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ : రాఘవి బిష్త్, ప్రియా మిశ్రా

Next Story