123 ఏళ్ల నాటి రికార్డులు బద్దలు కొట్టిన ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు
By - Medi Samrat |
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో పెర్త్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో హెడ్ కేవలం 69 బంతుల్లోనే సెంచరీ సాధించి, 123 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా కేవలం రెండు రోజుల్లోనే విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్, కేవలం 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. 36 బంతుల్లో అర్ధశతకం, 69 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ బ్యాటర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. జెస్సోప్ 1902లో ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో సెంచరీ సాధించగా, 123 ఏళ్ల తర్వాత హెడ్ ఆ రికార్డును అధిగమించాడు. యాషెస్ సిరీస్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. 2006లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 57 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనర్‌గా అత్యంత వేగంగా సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ (69 బంతులు, 2012) రికార్డును హెడ్ సమం చేశాడు. ఈ మ్యాచ్ కేవలం 847 బంతుల్లోనే ముగియడం విశేషం. యాషెస్ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మూడో టెస్టుగా ఇది రికార్డులకెక్కింది.