షోయ‌బ్ అక్త‌ర్ ఇంట్లో తీవ్ర విషాదం

Shoaib Akhtar mother passes away.పాకిస్తాన్‌ మాజీ ఆట‌గాడు షోయ‌బ్ అక్త‌ర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Dec 2021 10:14 AM GMT
షోయ‌బ్ అక్త‌ర్ ఇంట్లో తీవ్ర విషాదం

పాకిస్తాన్‌ మాజీ ఆట‌గాడు షోయ‌బ్ అక్త‌ర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆదివారం తెల్ల‌వారుజామున అనారోగ్యంతో అక్త‌ర్ త‌ల్లి క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అక్త‌ర్ వెల్ల‌డించారు. 'నా తల్లి, నా సర్వస్వం అల్లాహ్ సంకల్పంతో స్వర్గ నివాసానికి బయలుదేరింది. ఇస్లామాబాద్ లోని సెక్టార్ హెచ్ లో అంత్యక్రియలు జరుగుతాయి..' అని అక్త‌ర్ ట్వీట్ చేశాడు. ఈ విష‌యం తెలిసిన ప‌లువురు తాజా, మాజీ క్రికెట‌ర్లు అక్త‌ర్ కుటుంబానికి సంతాపం తెలియ‌జేస్తున్నారు.

పాక్ మీడియా తెలిపిన వివ‌రాల మేర‌కు.. అక్త‌ర్ త‌ల్లి గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం తెల్ల‌వారుజామున ఆమె తుదిశ్వాస విడిచిన‌ట్లు తెలిపింది. ఇక టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా సంతాపం తెలిపారు. 'ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి' తెలియజేస్తున్నాను అని భ‌జ్జీ ట్వీట్ చేశారు.

పాక్ సీనియ‌ర్ ఆట‌గాడు షోయబ్ మాలిక్, సోహైల్ తన్వీర్, ఫవాద్ ఆలం, అహ్మద్ షెహజాద్, మిస్బా ఉల్ హక్,వకార్ యూనిస్, అప్తాబ్ ఆలం, మహ్మద్ హఫీజ్, వసీం అక్రమ్ సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. పోష‌బ్ అక్త‌ర్ ను అభిమానులు ముద్దుగా రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పిలుచుకుంటారు. 2002లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అక్తర్ గంటకు 161 కి.మీటర్ల వేగంతో బంతిని విసిరి అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. అక్త‌ర్ మొత్తంగా 224 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్ మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా 178, 247, 19 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Next Story