ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెస్సన్‌లదేనని షోయబ్ అఖ్తర్ ఆరోపించాడు. సల్మాన్ ఆఘాకు జట్టులో ఆడే అర్హతే లేదని, అతనే జట్టులో అత్యంత బలహీనమైన ఆటగాడన్నాడు. కెప్టెన్ గురించి చెప్పాలంటే, అతనికి అసలు ఏమీ తెలియదు. అతను జట్టులో ఏం చేస్తున్నాడో, ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదన్నాడు షోయబ్. ఆరో స్థానంలో పాకిస్థాన్ తరపున బ్యాటింగ్‌కు వస్తాడు. అదే స్థానంలో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లతో పోల్చిచూడాలని హితవు పలికాడు. మంచివాడు అయితే సరిపోదని, ప్రతిభతో జట్టుకు ఏం అందిస్తున్నాడన్నదే ముఖ్యమని అఖ్తర్ స్పష్టం చేశాడు.
హసన్ నవాజ్ లాంటి మ్యాచ్ విన్నర్‌ను కాదని, అనుభవం లేని ఆటగాళ్లను ఎందుకు తీసుకున్నారని, షోయబ్ ప్రశ్నించారు. బ్యాటింగ్‌లో 10 ఓవర్లలో 91 పరుగులు చేసిన జట్టు, సులభంగా 200 పరుగులు చేయాల్సింది. కానీ అలా జరగలేదని అఖ్తర్ తెలిపారు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై పాక్ బౌలర్లు సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోయారని, అభిషేక్‌కు షార్ట్ బంతులు వేయలేకపోయారన్నారు. సల్మాన్ ఆఘా కెప్టెన్ తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. తప్పుడు సెలక్షన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని అఖ్తర్ విమర్శించారు.