సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన ధావన్.. ఇక‌పై ఆ లీగ్‌లో ఆడుతూ అల‌రిస్తాడు..!

భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on  26 Aug 2024 9:46 AM GMT
సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన ధావన్.. ఇక‌పై ఆ లీగ్‌లో ఆడుతూ అల‌రిస్తాడు..!

భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ రిటైర్మెంట్ తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు త‌న పేరు న‌మోదు చేసుకున్నాడు. దీంతో అత‌డు క్రికెట్‌లో రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. ఇకపై ఐపీఎల్‌లో కూడా ధావన్‌ కనిపించడు. గత సీజన్ వరకూ అతడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా IPL ఆడాడు. కానీ ఇప్పుడు అతడు ఈ T20 లీగ్‌లో కనిపించడు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చేరిన తర్వాత శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఈ కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించడం.. నా రిటైర్మెంట్ తర్వాత ఆదర్శవంతమైన నిర్ణ‌యంగా అనిపిస్తోంది. నా శరీరం ఇప్పటికీ ఆటకు సిద్ధంగా ఉంది. క్రికెట్ నా జీవితంలో ఒక భాగమని.. నా నిర్ణయంతో నేను పూర్తిగా సంతృప్తి చెందానని పేర్కొన్నాడు. నా క్రికెట్ స్నేహితులను మళ్లీ కలవడానికి.. మా అభిమానులను అలరించడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. తద్వారా మనమంతా కొత్త చిరస్మరణీయ క్షణాలను సృష్టించగల‌మ‌ని అన్నాడు.

శిఖర్ ధావన్‌ను స్వాగతిస్తూ.. ఎల్‌ఎల్‌సి సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా మాట్లాడుతూ.. శిఖర్ ధావన్ మాతో చేరడం మాకు సంతోషంగా ఉంది. అతని అనుభవం, అత‌డి ప్రతిభ టోర్నీని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది.. అభిమానులను అలరిస్తుంది. క్రికెట్‌లోని దిగ్గజాలతో అతడిని చూడాలని మేము ఎదురుచూస్తున్నాము. ఇది మన దిగ్గజ క్రికెటర్లకు 'సెకండ్ ఇన్నింగ్స్'గా మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

శిఖర్ ధావన్ మాత్రమే కాదు, అతని కంటే ముందు చాలా మంది క్రికెటర్లు తమ రిటైర్మెంట్ తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఆరోన్ ఫించ్, మార్టిన్ గప్టిల్, హషీమ్ ఆమ్లా కూడా ఉన్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ తదుపరి సీజన్ సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభం కానుంది.

Next Story