Video : థర్డ్ అంపైర్ కూడా త‌డ‌బ‌డ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?

బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.

By Medi Samrat
Published on : 26 Jun 2025 12:25 PM IST

Video : థర్డ్ అంపైర్ కూడా త‌డ‌బ‌డ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?

బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. వెస్టిండీస్ బౌలర్ల దాటికి కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. అనంత‌రం వెస్టిండీస్ స్టంప్స్ వరకు నాలుగు వికెట్లు కోల్పోయి 57 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్(59) అత్యధిక పరుగులు చేశాడు.

ఇదిలావుండ‌గా.. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ వేసిన బంతికి థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న నిర్ణ‌యం వివాద‌స్ప‌ద‌మైంది. ఈ వివాదం ట్రావిస్ హెడ్ వికెట్‌కు సంబంధించింది. ఈ విష‌య‌మై అంద‌రూ అంపైర్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఆస్ట్రేలియా (WI vs AUS) టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. విండీస్ బౌలర్లు షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ ప్రారంభంలో అసీస్ బ్యాట‌ర్ల‌కు షాక్‌లు ఇచ్చారు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ 53 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వివాదం చెలరేగింది. ఆ సమయంలో షమర్ జోసెఫ్ వేసిన బంతి ట్రావిస్ హెడ్ బ్యాట్ ఔటర్ ఎడ్జ్ ను తాకడంతో బంతి వికెట్ కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది.

46వ‌ ఓవర్ రెండో బంతిని ట్రావిస్ హెడ్ డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు, కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకుని వికెట్ కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీని తర్వాత అప్పీల్ చేశారు.. కానీ బంతి తన చేతికి నేరుగా వచ్చిందో లేదో తనకు తెలియదని హోప్ ఒప్పుకున్నాడు.

ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ అప్పీల్‌ను థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. బంతి బ్యాట్‌కు త‌గిలిన‌ట్లు స్ప‌ష్టంగా కనిపించింది. దీని తర్వాత క్యాచ్ ప‌రిశీలించ‌గా.. మొదటి రీప్లేలో.. బంతి కిందకి వెళుతున్నప్పుడు గ్లౌజెస్‌ కింద ఉన్నట్లు తేలింది. జూమ్‌లో చూడ‌గా.. బంతి కింద గ్లౌజెస్‌ లేవని సందేహాస్ప‌దంగా క‌నిపించింది. దీంతో థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ ట్రావిస్ హెడ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.

బంతి నేరుగా గ్లోవ్‌లోకి వెళ్లిందనడానికి ఆయ‌న‌ వద్ద స్పష్టమైన ఆధారాలు లేకపోవడమే అతని నిర్ణయానికి కారణం. అయితే, ట్రావిస్ హెడ్ ఈ లైఫ్ సేవ్‌ను పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. అతడు మరో 6 పరుగులు మాత్ర‌మే చేశాడు. 59 పరుగుల వద్ద జస్టిన్ గ్రేవ్స్ బౌలింగ్‌లో అవుట‌య్యాడు.

Next Story