రేపు రెండో టెస్టు.. ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్..!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గురువారం టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 26 Sept 2024 3:00 PM ISTబంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గురువారం టీ20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాన్పూర్‌లో భారత్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు వెటరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రేపు అంటే సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో భారత్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో షకీబ్ ఆడనున్నాడు. దీని తర్వాత అతడు బంగ్లాదేశ్ తరపున మరో సిరీస్‌లో టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నాడు. ఆపై అతడు రెడ్ బాల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతాడు. దక్షిణాఫ్రికాతో మిర్పూర్‌లో జరిగే టెస్టు తనకు చివరి టెస్టు అని చెప్పాడు.
భారత్‌తో రెండో టెస్టుకు ముందు కాన్పూర్‌లో షకీబ్ మీడియాతో మాట్లాడాడు. "రిటైర్ అవడం నా కోరిక. నేను నా నిర్ణయాన్ని బీసీబీ మరియు సెలెక్టర్లతో పంచుకున్నాను. "వారు నాతో ఏకీభవించారు. నేను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి ఆ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతాను. మీర్పూర్‌లో నా టెస్ట్ కెరీర్‌ను ముగించడానికి వీలుగా వారు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాడు. "నా చివరి మ్యాచ్‌గా ఆడాలనేది నా కోరిక. అది జరగకపోతే.. ఇదే (కాన్పూర్ టెస్టు) నా చివరి మ్యాచ్ అవుతుందని పేర్కొన్నాడు.
"T20I లలో ప్రపంచ కప్ లో నేను నా చివరి మ్యాచ్ ఆడినట్లు భావించాను. నేను సెలెక్టర్లు, బోర్డుతో దీని గురించి చర్చించాను. నేను 2026 T20 ప్రపంచ కప్‌ను చూస్తున్నాను. ఇది సరైన సమయం.. నేను ముందుకు వెళ్లడానికి.. BCB కొంతమంది కొత్త ఆటగాళ్లను పరిశీలిస్తుంది. వారు కొంతమంది గొప్ప ఆటగాళ్లను కనుగొంటారు. మేము 2026 ప్రపంచ కప్‌లో బాగా రాణిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
నేను బంగ్లాదేశ్ పౌరుడిని, కాబట్టి నాకు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి ఎటువంటి సమస్య లేదు. కానీ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్ళిన తర్వాత నా సమస్యలు మొదలవుతాయి. నేను బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నప్పుడు.. భద్రత సమస్య అనేది నా సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుండి నేను వింటున్నాను, వారు ఆందోళనతో ఉన్నారు. ఒక పరిష్కారం ఉంటుందని నేను ఆశిస్తున్నానని బంగ్లాలో నెలకొన్న భద్రతా సమస్యల గురించి మాట్లాడాడు.