అక్త‌ర్‌, ష‌మీ మ‌ధ్య 'క‌ర్మ' వివాదంపై స్పందించిన అఫ్రిది

Shahid Afridi on Mohammed Shami's 'Karma' Tweet. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్ కు చెందిన పలువురు భారత్ ను ట్రోల్ చేశారు.

By Medi Samrat  Published on  14 Nov 2022 2:15 PM GMT
అక్త‌ర్‌, ష‌మీ మ‌ధ్య క‌ర్మ వివాదంపై స్పందించిన అఫ్రిది

టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్ కు చెందిన పలువురు భారత్ ను ట్రోల్ చేశారు. మరో వైపు అదృష్టం కొద్దీ ఫైనల్ కు చేరిన పాక్.. అక్కడ ఇంగ్లండ్ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ... పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ట్వీట్ పై స్పందిస్తూ "సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. షమీ ట్వీట్ పై పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది స్పందించాడు. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించాడు. "మనం క్రికెటర్లం, క్రీడా రాయబారుల్లాంటి వాళ్లం. మనం ఎప్పుడూ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభానికి చరమగీతం పాడడానికి ప్రయత్నించాలి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలను వ్యాపింపచేస్తాయి. అన్నీ తెలిసిన మనమే ఇలా చేస్తుంటే... అక్షరజ్ఞానం లేని మూర్ఖులు, సాధారణ వ్యక్తుల నుంచి ఇంకేం ఆశించగలం?" అని ఆఫ్రిది చెప్పుకొచ్చాడు.

ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలంటే క్రీడలే అందుకు మంచి మార్గమని భావిస్తాను.. మేం భారత్ తో ఆడాలని భావిస్తున్నాం... పాక్ లో భారత్ పర్యటించాలని కోరుకుంటున్నామని అఫ్రిది చెప్పుకొచ్చాడు. మెల్‌బోర్న్‌లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో పాకిస్థాన్ జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే పాక్ ఓట‌మిపై అక్త‌ర్ స్పందిస్తూ ప‌గిలిన గుండె ఎమోజీని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు ష‌మీ రియాక్ట్ అయ్యాడు. సారీ బ్ర‌ద‌ర్‌, దీన్ని క‌ర్మ అంటార‌ని ష‌మీ ట్వీట్ చేశాడు. అయితే ష‌మీ చేసిన ట్వీట్‌కు అక్త‌ర్ రిప్లై ఇచ్చాడు. సున్నిత‌మైన ట్వీట్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటూ ష‌మీకి మ‌రో ట్వీట్ చేశాడు. కామెంటేట‌ర్ హ‌ర్షాబోగ్లే పాక్ ఓడిన తీరును ఆ ట్వీట్‌లో చెప్పాడు.


Next Story