పాక్ క్రికెటర్ షాహిన్ అఫ్రిదికి.. మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిదికి పెళ్లి జరగనుందంటూ పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ వీటిపై నోరు మెదపని అఫ్రిది.. తన కూతురు పెళ్లిపై తొలిసారి స్పందించాడు. తన కూతురు పెళ్లి త్వరలోనే షాహిన్ అఫ్రిదితో జరగనుందని స్పష్టం చేశారు.
ఈ విషయమై అఫ్రిది మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లి త్వరలోనే షాహిన్ అఫ్రిదితో జరగనుంది. పెళ్లి విషయమై ఇరు కుటుంబాలు చర్చించుకున్నాం. అయితే.. ఈ ప్రొపోజల్‌కు ముందు నా కూతురు అక్సా, షాహిన్‌లు రిలేషన్ ఉన్నారన్నది అబద్దమని అన్నాడు అఫ్రిది. ఇది పెద్దల అంగీకారంతో జరుగుతున్న పెళ్లి అని.. షాహిన్ తండ్రి నా కూతురు తన కోడలు కావాలని ఇంటికి వచ్చి అడగడంతో కాదనలేకపోయానని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
ఇదిలావుంటే.. అఫ్రిది కూతురు అక్సా ప్రస్తుతం డాక్టర్ చదువుతుంది. త్వరలోనే విదేశాలకు వెళ్లాలనుకుంటుంది. షాహిన్ కూడా ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. కాబట్టి ఇద్దరు తమ కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి ఉంటుందని.. అప్పటి వరకూ ఇటువంటి రూమర్లకు చెక్ పెట్టండని అఫ్రిది అన్నారు. షాహిద్ అఫ్రిది పాక్ తరుపున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 లు ఆడాడు. టెస్టుల్లో 1,716. వన్డేల్లో 8,064, టీ20ల్లో 1,416 పరుగులు చేశాడు. టెస్టుల్లో 48, వన్డేల్లో 395, టీ20ల్లో 98 వికెట్లు తీశాడు. ఇక షాహీన్ అఫ్రీదీ ప్రస్తుతం పాక్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు.