వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగానే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తుండటంతో భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు.
మ్యాచ్ రద్దు కావడంపై పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. క్రీడలను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని, భారత్, పాకిస్థాన్‌తో ఆడకూడదని అనుకుంటే టోర్నీకి ముందే ఆ నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాజకీయాలు మధ్యలో వస్తే ముందుకు ఎలా సాగుతాం? కమ్యూనికేషన్ లేకుండా సమస్యలు పరిష్కారం కావన్నాడు అఫ్రీది. తన వ్యాఖ్యల వల్లే మ్యాచ్ రద్దు అయిందని తెలిస్తే తాను మైదానానికి కూడా వెళ్లేవాడిని కాదని అఫ్రిది చెప్పాడు. క్రీడగా క్రికెట్ అతిపెద్దది. దీనిలో రాజకీయాలు తీసుకొచ్చారని, ఒక భారత క్రికెటర్ పాకిస్థాన్‌తో ఆడనని చెప్పడం సరైనది కాదన్నారు. ఇకపై మ్యాచ్ ఆడకండి, ఇంట్లో కూర్చోవాలని అన్నాడు అఫ్రీది.